దాదాపు రెండు దశాబ్దాలుగా అఫ్గానిస్థాన్‌లో ఉన్న అమెరికా బలగాలను ఉపసంహరించుకోవడంపై ప్రతిపక్ష పార్టీ నేతలు అధ్యక్షుడు జో బైడెన్ ను తప్పుపడుతున్నారు. అఫ్గానిస్థాన్ ను సమస్యల వలయంలో విడిచి వచ్చారంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల తాలిబన్లు ఇచ్చిన గడువు ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి దాటాక అమెరికా బలగాలను అఫ్గాన్ నుంచి వెనక్కి రప్పించారు. 


తాను తీసుకున్న నిర్ణయం సరైందేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకోవడాన్ని సమర్థించుకున్నారు. అమెరికా పౌరుల ప్రాణాలను కాపాడుకునేందుకు కీలక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అఫ్గాన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లక్ష మందిని ఆ దేశం నుంచి సురక్షిత ప్రాంతాలకు తమ బలగాలు తరలించాయని తెలిపారు. గత 17 రోజులుగా అఫ్గాన్‌లో తమ బలగాలు చేపట్టిన పౌరుల తరలింపు ప్రక్రియ ముగించాల్సి వచ్చిందన్నారు. అఫ్గాన్ లో 20ఏళ్ల అమెరికా బలగాల సేవలు ముగిశాయని జో బైడెన్ అధికారికంగా ప్రకటించారు. ఎలాంటి ప్రాణ నష్టం, యుద్ధం జరగకుండా తరలింపు ప్రక్రియ పూర్తి చేయాలని భావించామని.. ఆ పనిని తమ బలగాలు చేసి చూపించాయని కొనియాడారు. రక్తపాతం జరగకుండా బలగాలను ఉపసంహరించుకున్నామని.. తాలిబన్లు అఫ్గాన్ పౌరులకు ఎలాంటి నష్టాన్ని కలిగించకూడదన్నారు. తాలిబన్లు అమెరికాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు.


Also Read: Taliban News: తాలిబన్లతో తొలిసారి భారత్ ఉన్నత స్థాయి చర్చలు 


యుద్ధాన్ని కొనసాగించలేం..
‘అఫ్గానిస్థాన్‌లో రెండు దశాబ్దాలుగా బలగాలను ఉంచాం. ఇప్పుడు యుద్ధాన్ని కొనసాగించాలని మేం భావించడం లేదు. అఫ్గాన్ నుంచి అమెరికా పౌరులను సురక్షితంగా రావాలనుకున్నాం. కానీ దాదాపు 200 వరకు అమెరికా పౌరులు అఫ్గాన్‌లోనే చిక్కుకుపోయారు. అమెరికా పౌరుల ప్రాణాలు కాపాడేందుకు ఆగస్టు 31 వరకు డెడ్‌లైన్‌కు కట్టుబడి ఉన్నాం. ఆ గడువులోగా మొత్తం లక్ష మంది పౌరులను అఫ్గాన్ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాం. యుద్ధాన్ని కొనసాగించడం ఇష్టం లేక పౌరులను రక్షించి, తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగానే అఫ్గాన్ నుంచి బలగాలను వెనక్కి రప్పించామని’ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వివరించారు. పౌరులపై అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించకూడదని, పౌరులపై దాష్టీకానికి పాల్పడకూడదని పలు విషయాలు తాలిబన్లకు సూచించినట్లు పేర్కొన్నారు. తాలిబన్ నేతలు వీటిని దృష్టిలో ఉంచుకుని.. మాట నిలబెట్టుకోవాలని అమెరికా తరఫున అధ్యక్షుడు బైడెన్ సూచించారు.


Also Read: ABP EXCLUSIVE: 'భయపడుతూ బతకలేను.. తాలిబన్లు చెప్పింది చేయలేను.. అందుకే పారిపోయా' 


డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అయితే..


మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బలగాల ఉపసంహరణపై ఇదివరకే ఒప్పందం చేసుకున్నారని బైడెన్ గుర్తు చేశారు. ఆ మేరకు అమెరికా ప్రభుత్వం సేనలను వెనక్కి రప్పించిందన్నారు. అమెరికా పౌరులను ప్రతి ఒక్కరినీ తుది గడువులోగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తాను ఆకాంక్షించానని చెప్పారు. గత ఒప్పందాలను రద్దు చేసుకుని అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లతో యుద్ధానికి దిగడం సరికాదన్నారు. తద్వారా ప్రాణ నష్టం సంభవిస్తుందని పేర్కొన్నారు. ట్రంప్ ప్రభుత్వం అయితే ఇంకా త్వరగానే బలగాలను అఫ్గాన్ నుంచి వెనక్కి రప్పించేదని అధికార డెమొక్రాటిక్ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. 


ప్రతిపక్ష నేతల గగ్గోలు.. 
అఫ్గానిస్థాన్‌ నుంచి సేనలను వెనక్కి రప్పించడం అమెరికా తప్పిదమని ప్రతిపక్ష నేతలు గగ్గోలు పెడుతున్నారు. అమెరికా ప్రభుత్వం వైఫల్యానికి ఇది నిదర్శనమని రిపబ్లికన్ పార్టీ నేత కెవిన్ మెక్‌కార్తీ విమర్శించారు. అమెరికా ప్రభుత్వం దీనికి నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.