అఫ్గాన్ సంక్షోభం తర్వాత తొలిసారి తాలిబన్లతో భారత్ చర్చలు జరిపింది. ఖతార్​లోని భారత రాయబారి దీపక్​ మిట్టల్​, తాలిబన్​ నేత షేర్​ మహ్మద్​ అబ్బాస్​ స్టానెక్జాయ్​తో దోహా వేదికగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తాలిబన్లకు భారత్ తన ప్రతిపాదనలను స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. అఫ్గాన్​ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన రోజే ఈ భేటీ జరిగింది.


తేల్చిచెప్పిన భారత్..


భారత్​పై ఉగ్రవాద కార్యకలాపాలకు తెగబడేవారికి అఫ్గానిస్థాన్​ మద్దతివ్వకూడదని సమావేశంలో దీపక్ మిట్టల్​ తాలిబన్లకు తేల్చిచెప్పినట్టు భారత విదేశాంగశాఖ వెల్లడించింది. అఫ్గాన్​లోని భారతీయుల తరలింపుపైనా ఈ సమావేశంలో కీలక చర్చ జరిగినట్టు పేర్కొంది. వీటిపై తాలిబన్లు సానుకూలంగా స్పందించినట్టు స్పష్టం చేసింది.


భారత్ తో స్నేహం..


ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోన్న తాలిబన్లు ఇంటా బయటా మద్దతు కూడగడుతున్నారు. అన్నీ పార్టీలు, వర్గాలను కలుపుకొని ఓ సంయుక్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రపంచదేశాలతోనూ సఖ్యతగా ఉండాలని తాలిబన్లు యోచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆసియా దేశాలతో మైత్రి బంధం కొనసాగించాలనుకుంటున్నారు. ఇటీవల భారత్ విషయంలో తాలిబన్లు చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.


Also Read: Afganisthan Crisis Update: అఫ్గానిస్థాన్ కు అమెరికా బైబై.. తాలిబన్లు జాయ్ జాయ్


భారత్ తో వాణిజ్య, ఆర్థిక, రాజకీయ సంబంధాలను కొనసాగించాలని తాము ఆశిస్తున్నట్లు మహమ్మద్​ అబ్బాస్​ స్టానెక్జాయ్ ఇటీవల​ అన్నారు. ఈ ప్రాంతంలో భారత్ ను ఓ ముఖ్యదేశంగా అభివర్ణించారు.


అత్యున్నస్థాయి బృందం..


అఫ్గానిస్థాన్‌ విషయంలో తక్షణం చేపట్టాల్సిన చర్యలపై కేంద్రం దృష్టిపెట్టింది. అమెరికా బలగాలు అఫ్గాన్‌ను పూర్తిగా వీడిన వేళ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి బృందం ఏర్పాటు చేశారు. ఈ బృందంలో విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్ సభ్యులుగా ఉన్నారు. 


20 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి తెరదించుతూ అఫ్గానిస్థాన్ కు బైబై చెప్పి అమెరికా సైన్యం వెనుదిరిగింది. అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ విధించిన ఆగస్టు 31 గడువు కంటే ఒక రోజు ముందే యూఎస్ దళాలు అఫ్గాన్ ను వదిలి వెళ్లాయి. సోమవారం అర్ధరాత్రి కాబూల్ విమానాశ్రయం నుంచి అమెరికా దళాలతో కూడిన చివరి విమానం అఫ్గాన్ నుంచి బయలుదేరింది. అప్గాన్ లో పరిస్థితి ఇంత అల్లకల్లోలంగా ఉన్న సమయంలో అమెరికా చేతులు దులుపుకొని వెళ్లిపోవడంపై ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి.