20 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి తెరదించుతూ అఫ్గానిస్థాన్ కు బైబై చెప్పి అమెరికా సైన్యం వెనుదిరిగింది. అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ విధించిన ఆగస్టు 31 గడువు కంటే ఒక రోజు ముందే యూఎస్ దళాలు అఫ్గాన్ ను వదిలి వెళ్లాయి. సోమవారం అర్ధరాత్రి కాబూల్ విమానాశ్రయం నుంచి అమెరికా దళాలతో కూడిన చివరి విమానం అఫ్గాన్ నుంచి బయలుదేరింది. అప్గాన్ లో పరిస్థితి ఇంత అల్లకల్లోలంగా ఉన్న సమయంలో అమెరికా చేతులు దులుపుకొని వెళ్లిపోవడంపై ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి. 


2 దశాబ్దాల పోరాటం..


ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రెండు దశాబ్దాల పాటు ఉగ్రవాదంపై పోరాడిన అమెరికా చివరికి ఎలాంటి ఫలితం లేకుండానే చేతులెత్తేసింది. ఇది అమెరికా చరిత్రలోనే ఘోర పరాజయంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. తాలిబన్ల చేతిలో అఫ్గాన్ ను వదిలేయడం సమంజసం కాదన్నారు.  


రెండు దశాబ్దాల యుద్ధానికి అమెరికా సంపూర్ణ ముగింపు పలికింద. అఫ్గాన్‌ వీడుతున్న చిట్టచివరి సైనికుడి ఫొటోను అమెరికా విడుదల చేసింది. వియత్నాం యుద్ధానికి, అఫ్గాన్‌ యుద్ధానికి దాదాపు చాలా పోలికలున్నాయి. ఈ క్రమంలో వియత్నాం యుద్ధంలో చిట్టచివరి వ్యక్తి కూడా అఫ్గాన్‌ యుద్ధంలో భాగమవ్వడం కొస మెరుపు. 


అతడే..






అఫ్గానిస్థాన్‌ను వీడిన చిట్టచివరి అమెరికా సైనికుడు మేజర్‌ జనరల్‌ క్రిస్‌ డోనాహువే. సోమవారం అర్ధరాత్రి కాబుల్‌ నుంచి బయల్దేరిన సీ-17 విమానంలోకి చివరగా ఎక్కింది అతనే. ఈ విషయాన్ని అమెరికా రక్షణశాఖ కార్యాలయం ట్విట్టర్ వేదికగా ప్రకటిస్తూ మేజర్‌ జనరల్ విమానం వద్దకు వస్తోన్న ఫొటోను విడుదల చేసింది.


మేజర్‌ జనరల్‌ డోనాహువే.. 82వ ఎయిర్‌బోర్న్‌ డివిజన్‌లో కమాండర్‌గా పనిచేస్తున్నారు. కాబూల్‌లో అమెరికా మిషన్‌ను ముగించుకుని చివరగా ఆయన విమానమెక్కారు.


తరలింపులో రికార్డ్.. 


ఆగస్టు 14 నుంచి దాదాపు 1.23 లక్షల మంది అఫ్గాన్‌ పౌరులను తరలించినట్లు అమెరికా వెల్లడించింది. అమెరికా చరిత్రలోనే ఇదే అతిపెద్ద తరలింపు ప్రక్రియ. 


తాలిబన్లు ఫుల్ ఖుష్..


మరోవైపు అమెరికా దళాలు అఫ్గానిస్థాన్‌ను పూర్తిగా ఖాళీ చేయడంతో తాలిబన్లు సంబరాలు జరుపుకున్నారు. తుపాకులతో గాలిలో కాలుస్తూ ఖుషీఖుషీగా ఉన్నారు.