నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించే నేషనల్‌ ఎలిజిబుల్‌ టెస్టు (NET) పరీక్షల తేదీలు మారాయి. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్ (UGC) ఆధ్వర్యంలో ఎన్టీఏ నిర్వహించే ఈ పరీక్షను అక్టోబర్‌ నెలలో నిర్వహించనున్నారు. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం యూజీసీ నెట్ 2021 పరీక్షలు అక్టోబర్‌ 6 నుంచి 11వ తేదీ వరకు జరగాల్సి ఉంది. ఈ తేదీల్లో ఇతర ముఖ్యమైన పరీక్షలు ఉండటంతో క్లాష్ అయ్యే ప్రమాదం ఉందని.. పరీక్ష తేదీలను సవరించినట్లు ఎన్టీఏ తెలిపింది.


తాజా షెడ్యూల్ ప్రకారం యూజీసీ నెట్ 2021 పరీక్షలు రెండు బ్లాకులుగా జరగనున్నాయి. అక్టోబర్ 6 నుంచి 8 వరకు ఒక బ్లాక్.. తిరిగి అక్టోబర్ 17 నుంచి 19 వరకు మరో బ్లాక్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఎన్టీఏ పేర్కొంది. మారిన షెడ్యూల్ సహా మరిన్ని వివరాలను ugcnet.nta.nic.in వెబ్‌సైట్ లో చూడవచ్చు. 


2021 సంవత్సరానికి నేషనల్‌ ఎలిజిబుల్‌ టెస్టు నోటిఫికేషన్ గత నెల 11న విడుదలైంది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఎల్లుండితో (సెప్టెంబర్ 5) ముగియనుంది. ఈ నెల 5 తర్వాత దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోమని ఎన్టీఏ స్పష్టం చేసింది. దరఖాస్తు ఫీజులను ఈ నెల 6 వరకు చెల్లించవచ్చని తెలిపింది. దరఖాస్తుల్లో తప్పుల సవరణలకు ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకు అవకాశం కల్పించింది. 


కోవిడ్ కారణంగా పలు మార్లు వాయిదా..
కోవిడ్ కారణంగా యూజీసీ నెట్ పరీక్షలు పలుమార్లు వాయిదా పడ్డాయి. గతేడాది జరగాల్సిన యూజీసీ నెట్ డిసెంబర్ 2020తో పాటు ఈ ఏడాది నిర్వహించాల్సిన జూన్ 2021 షెడ్యూల్ కూడా వాయిదా పడింది. దీంతో యూజీసీ అంగీకారంతో ఈ రెండు పరీక్షలను విలీనం చేసి ఒకటిగా నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించింది. యూజీసీ నెట్ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ పరీక్ష (CBT) విధానంలో జరుగుతాయి. 


డిసెంబర్ 2020- జూన్ 2021 రెండింటికి సంబంధించి జేఆర్ఎఫ్ (JRF) స్లాట్‌లను విలీనం చేశారు. అయితే వర్గాల వారీగా జేఆర్ఎఫ్‌ల కేటాయింపు పద్ధతిలో మాత్రం ఎలాంటి మార్పు ఉండవని అధికారులు వెల్లడించారు. యూజీసీ నెట్ హాల్‌టికెట్లను ఎప్పటి నుంచి డౌన్ లౌడ్ చేసుకోవచ్చనే వివరాలను త్వరలోనే చెబుతామని అన్నారు. దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, కాలేజీల్లో పని చేయాలంటే ఈ పరీక్షను క్లియర్ చేయాలి. ఇలా చేసిన వారికి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ పొందవచ్చు. 


Also Read: GATE 2022: నేటి నుంచి గేట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ.. ఈ సారి కొత్తగా రెండు పేపర్లు..


Also Read: TS LAWCET Results: తెలంగాణ లాసెట్, ఐసెట్‌, పీజీఈసెట్ ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే?