ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE)- 2022 రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి  (సెప్టెంబర్ 2) నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు గడువు సెప్టెంబర్ 24వ తేదీతో ముగియనుంది. ఆలస్య రుసుముతో అక్టోబర్ 1 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఐఐటీ ఖరగ్‌పూర్ వెల్లడించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు gate.iitkgp.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

  


వచ్చే ఏడాది ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో గేట్ పరీక్షలను నిర్వహించనున్నారు. రెండు సెషన్లలో గేట్ పరీక్షలు ఉంటాయి. కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT) పరీక్ష ఉంటుంది. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్ జరుగుతుంది. 


కొత్తగా రెండు పేపర్లు.. 
గేట్ 2022 పరీక్షలో ఈసారి కొత్తగా జియోమాటిక్స్ ఇంజనీరింగ్ (GE ), నావల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్ (NM) అనే రెండు పేపర్లను ప్రవేశపెట్టినట్లు ఐఐటీ ఖరగ్‌పూర్ వెల్లడించింది. కొత్తగా ప్రవేశపెట్టిన రెండింటితో కలిపి మొత్తం గేట్ పేపర్ల సంఖ్య 29కి చేరినట్లు తెలిపింది. 
ఏటా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు మాత్రమే గేట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తామని.. ఈసారి బీడీఎస్, ఎంఫార్మసీ చదివిన వారికి కూడా అవకాశం ఇస్తున్నట్లు ఐఐటీ ఖరగ్‌పూర్ డైరెక్టర్ వీకే తివారీ పేర్కొన్నారు. ఎంఫార్మసీ, బీడీఎస్ ఉత్తీర్ణులైన వారు సైతం ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.


జియో ఇన్ఫర్మేటిక్స్, నౌకా నిర్మాణ పరిశ్రమల రంగాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి భవిష్యత్తులో అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ బ్రాంచుల్లోనూ గేట్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.


గేట్ స్కోర్‌తో లాభాలెన్నో..
గేట్​ స్కోర్​ ఆధారంగా ఐఐటీ, ఎన్​ఐటీ వంటి వాటితో పాటు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్​ ఇంజనీరింగ్​ కాలేజీల్లో ఎంఈ లేదా ఎంటెక్ కోర్సులలో​ చేరవచ్చు. విదేశాల్లోని పలు యూనివర్సిటీలు కూడా గేట్​ స్కోర్​ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. గేట్​ స్కోర్​ ఆధారంగా పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు దక్కించుకునే అవకాశం కూడా ఉంది. డీఆర్​డీఓ, బీహెచ్​ఈఎల్​, గెయిల్​, ఇండియన్​ ఆయిల్, పవర్​ గ్రిడ్​, బెల్​, హాల్​ మొదలైన ప్రభుత్వ రంగ సంస్థలు.. కేవలం గేట్​ స్కార్​ ఆధారంగా అభ్యర్థులను షార్ట్​లిస్ట్​ చేసి, వారికి ఇంటర్వూ నిర్వహించి జాబ్స్ ఇస్తున్నాయి. 


Also Read: AP SSC Result 2021: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... పదో తరగతి విద్యార్థులకు ఇకపై మార్కులే... గ్రేడింగ్ విధానానికి స్వస్తి


Also Read: Telangana School Reopen: తెలంగాణలో స్కూల్స్ ఓపెన్ కు బ్రేక్... ప్రత్యక్ష బోధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు... ఆ విద్యార్థులపై చర్యలొద్దని ఆదేశం