అమరావతికి భూములిచ్చిన రాజధాని దళిత రైతులకు హైకోర్టులో ఊరట లభించింది.  నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూముల లావాదేవీలు జరిగినందున గత ప్రభుత్వం భూసమీకరణ ప్రక్రియలో భాగంగా ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పలువురు రైతులు ఊపిరి పీల్చుకున్నారు. అసైన్డ్ భూములు కలిగిన రైతులు తమ అవసరాల కోసం వాటిని విక్రయించుకునేందుకు జీవో నంబర్ 41ని గత తెలుగుదేశం ప్రభుత్వం జారీ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నంబర్ 41 ను రద్దు చేసి..  దాని స్ధానంలో జీవో నంబర్ 316 విడుదల చేశారు.


ప్రభుత్వం జారీ చేసిన 316వ నెంబర్ జీవో ప్రకారం అసైన్డ్ రైతుల నుంచి భూములు కొనడం చట్ట విరుద్ధం. దీంతో తాజా జీవో ఆధారంగా గతంలో జరిగిన క్రయ విక్రయాలు చట్ట విరుద్ధమని పేర్కొంటూ లావాదేవీలు నిర్వహించిన రైతులకు నోటీసులు జారీ చేసింది.  నివాస, వాణిజ్య ఫ్లాట్ల కేటాయింపును రద్దు చేసి, వాటిని ఎందుకు వెనక్కు తీసుకోకూడదో చెప్పాలని, లేకపోతే తమ వద్ద అందుబాటులో ఉన్న ఆధారాల్ని బట్టి ఫ్లాట్ల కేటాయింపు రద్దు చేస్తామని నోటీసుల్లో తెలిపారు. ఈ నోటీసులపై అసైన్డ్ రైతులు హైకోర్టులో పిటిషన్లు వేశారు.


అసైన్డ్ రైతుల్లో ఆరు కేటగిరీలు ఉన్నాయి. వీరిలో ఓ కేటగిరీ కింద ఉన్న రైతులకు ప్రస్తుతం నోటీసులు జారీ చేశారు. ఈ రైతులకు ప్రభుత్వం నేరుగా అసైన్డ్ భూమి కేటాయించలేదు. కానీ వారి వద్ద దశాబ్దాల కిందటే కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటున్నారు. అన్ని రికార్డుల్లోనూ వీరి పేరు ఆ  భూముల జాబితాలో ఉంది. అయితే ఎప్పుడు కొనుగోలు చేసినప్పటికీ .. ఇలా అసైన్డ్ భూములు కొనుగోలు చేయడం చెల్లదు కాబట్టి ఇప్పుడు వారి భూముల్ని ఎందుకు వెనక్కి తీసుకోకూడదని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. అయితే వారు ఇప్పటికే రాజధానికి పొలాలు ఇచ్చి రిటర్నబుల్ ప్లాట్లు తీసుకున్నందున వారికి ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించి..నోటీసులు జారీ చేసింది.


గతంలో అమల్లో ఉన్న జీవో ఆధారంగానే తాము క్రయ విక్రయాలు జరిపినట్లు అసైన్డ్ భూముల అమ్మకం దారులు, కొనుగోలుదారులు చెప్తున్నారు. ప్రభత్వం కూడా గుర్తించిందని .. రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చిన తర్వాత ఆ స్థలాలు, పొలాలుల తమవి కావని రద్దు చేయడం అంటే అన్యాయం చేయడమేనని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి చర్యలు నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో దళిత రైతులకు ఊరటలభించినట్లయింది.