దేశంలో దాదాపు 30 లక్షల ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ వెల్లడించింది. జూన్ 16వ తేదీ నుంచి జూలై 31 మధ్యలో తమకు 594 ఫిర్యాదులు అందాయని తెలిపింది. ఫిర్యాదులను పరిశీలించి.. 30 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసినట్లు స్పష్టం చేసింది. వాట్సాప్ అందించిన తాజా నివేదిక ప్రకారం.. దేశంలో 30,27,000 మంది అకౌంట్లు బ్యాన్ అయ్యాయి. ఈ అకౌంట్లకు సంబంధించిన ఫోన్ నంబర్లన్నీ +91తో ప్రారంభం అయ్యాయని తెలిపింది.
అనధికార సందేశాలు, స్పామ్ మెసేజీలు పంపే ఖాతాలపై వాట్సాప్ ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బ్యాన్ చేసిన వాటిలో కూడా 95 శాతం ఖాతాలు అలాంటివేనని కంపెనీ గుర్తించింది. వాట్సాప్ తన ప్లాట్‌ఫామ్‌ దుర్వినియోగాన్ని కట్టడి చేయడం కోసం ఈ చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా నెలకు సగటున 80 లక్షల ఖాతాలను బ్యాన్ చేస్తుంది. తాజాగా ఇండియాలో బ్యాన్ చేసిన ఖాతాలపై అకౌంట్ సపోర్ట్ (137), బ్యాన్ అప్పీల్ (316), ఇతర సపోర్ట్ (45), ప్రొడక్టు సపోర్టు (64), సేఫ్టీ (32) వంటి కారణాలతో పలువురు యూజర్లు రిపోర్ట్ చేసినట్లు తెలిపింది. వీటిలో 74 అకౌంట్లపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. 


గైడ్ లైన్స్ అనుసరించని ఖాతాలపై కొరడా..
సామాజిక మాధ్యమాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధించిన ఐటీ రూల్స్ 2021తో పాటు, వాట్సాప్ గైడ్ లైన్స్ అనుసరించని ఖాతాలను నిషేధిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం విధించిన ఐటీ రూల్స్ 2021ని మే 26 నుంచి అమలు చేస్తున్నట్లు వాట్సాస్ ప్రతినిధి పేర్కొన్నారు. దీనిలో భాగంగా ప్రతి 46 రోజులకోసారి నివేదిక సమర్పిస్తున్నట్లు వెల్లడించారు. మొదటి నివేదికను ఇప్పటికే విడుదల చేయగా.. ఇది రెండో నివేదిక అని తెలిపారు. వాట్సాప్ లో కంటెంట్ ను మానిటర్ చేసేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. దీంతో పాటు డేటా సైంటిస్టులు, నిపుణులు, యూజర్స్ సేఫ్టీ విభాగం వంటివి ఉంటాయని వాట్సాస్ ప్రతినిధి వెల్లడించారు. వీరంతా సమాచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారని తెలిపారు.


తన యూజర్లను ఆకర్షించేందుకు వాట్సాప్ ఎప్పుడూ ముందంజలో ఉంటుందని చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్లను తెస్తూ యూజర్లను అలరిస్తుంది. వాట్సాప్ ద్వారా పేమెంట్లు చేయడం.. ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లకు చాట్ హిస్టరీ పంపించుకోవడం వంటి ఎన్నో ఫీచర్లను యూజర్లకు అందించింది. 


Also Read: WhatsApp Payments: వాట్సాప్‌ పేమెంట్స్‌ చేస్తున్నారా? అవతలి వారికి మీ ఫీలింగ్ ఎంటో థీమ్ తో చెప్పెయండిలా..


Also Read: WhatsApp Feature: వాట్సాప్‌ మెసేజ్‌లకు రియాక్షన్ ఫీచర్.. త్వరలోనే లైక్ చేయవచ్చు..