తెలంగాణలో లాసెట్, పీజీఎల్ సెట్, పీజీఈసెట్, ఐసెట్ పరీక్షల ఫలితాలు ఈ నెలలో విడుదల కానున్నాయి. తెలంగాణలో లా కాలేజీల్లో న్యాయ విద్య ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్ సెట్ పరీక్ష ఫలితాలు ఈ నెల 7వ తేదీన విడుదల కానున్నాయి. ఇక పీజీఈసెట్ ఫలితాలను రేపు (సెప్టెంబర్ 4) లేదా సోమవారం (సెప్టెంబర్ 6) నాడు విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. వీటిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. తెలంగాణ ఐసెట్ ఫలితాలను సైతం కాకతీయ విశ్వవిద్యాలయం ఈ నెల 23వ తేదీన విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి వర్గాలు వెల్లడించాయి. ఫలితాల విడుదలకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిపాయి.
టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్ సెట్ పరీక్షలు గత నెల 23, 24 తేదీల్లో జరిగాయి. లాసెట్ పరీక్ష కోసం 39,866 మంది దరఖాస్తు చేసుకున్నట్లు కన్వీనర్ జీబీ రెడ్డి తెలిపారు. 3 సంవత్సరాల పాటు ఉంటే లాసెట్‌కు 28,904 మంది.. 5 సంవత్సరాల పాటు ఉండే లాసెట్‌కు 7,676 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. పీజీ లాసెట్ పరీక్షకు మొత్తం 3,286 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. కాగా, లాసెట్ (లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ) ద్వారా 3, 5 ఏళ్ల పాటు ఉండే ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు. ఇక పీజీఎల్ సెట్ (పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ద్వారా రెండేళ్ల పాటు ఉండే ఎల్ఎల్ఎం కోర్సులో చేరవచ్చు.
తెలంగాణలోని ఇంజనీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన పీజీఈసెట్ (పోస్టు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్టు) పరీక్షలు ఆగస్టు 11, 12, 13, 14 తేదీల్లో రెండు సెషన్లలో నిర్వహించారు. పీజీఈసెట్ ద్వారా గేట్ జీప్యాట్ విద్యార్థులకు ఎంఈ / ఎంఫార్మా / ఎంటెక్ / గ్రాడ్యుయేట్ లెవల్/ ఎంఆర్క్ ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పీజీఈసెట్ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఈ పరీక్షను 19 పేపర్లలో నిర్వహించింది. బీటెక్‌లో చదివిన బ్రాంచ్ ఆధారంగా సంబంధిత పేపర్లలో పరీక్షకు హాజరయ్యే అవకాశం కల్పించింది.
Also Read: Praveen Kumar Wins Silver Medal: భారత్ ఖాతాలో మరో పతకం.. హై జంప్‌లో ప్రవీణ్ కుమార్‌కు రజతం