Virat Kohli: కెరీర్‌లో వందో టెస్టు ఆడటానికి సిద్ధం అయిన విరాట్ కోహ్లీని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆకాశానికి ఎత్తేశాడు. భారత జట్టు ప్రస్తుతం ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం విరాటేనని... ఈ క్రెడిట్‌కు తను పూర్తిగా అర్హుడని తెలిపాడు. శుక్రవారం శ్రీలంకతో జరగనున్న టెస్టు మ్యాచ్‌తో రోహిత్ ఈ ఫార్మాట్లో కెప్టెన్‌గా తన ప్రయాణాన్ని ఆరంభించనున్నాడు.


టెస్టు జట్టుగా భారత్ ఇప్పుడు మంచి స్థాయిలో ఉందని, దానికి పూర్తి క్రెడిట్ విరాట్‌దేదని మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ పేర్కొన్నాడు. టెస్టు టీమ్‌కు తను అందించిన సేవలు అద్భుతమైనవి అన్నాడు.


తను ఎక్కడైతే ఆపేశాడో... అక్కడ నుంచి తాను ప్రారంభిస్తున్నానని, సరైన ఆటగాళ్లతో, సరైన విషయాన్ని చేయడమే తన కర్తవ్యమని తెలిపాడు. భారత్ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్‌కు చేరే అవకాశాలు ప్రస్తుతం తక్కువగానే ఉన్నప్పటికీ... రోహిత్ జట్టు సరైన దిశలోనే ప్రయాణిస్తుందన్నాడు.


ప్రస్తుతం ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా మధ్యలో ఉందని, అయితే గత రెండు, మూడు సంవత్సరాల్లో టీమిండియా ఎటువంటి తప్పులూ చేయలేదని రోహిత్ తెలిపాడు. విరాట్ కోహ్లీ కెరీర్‌లో మొదటి మ్యాచ్ నుంచి అద్భుతంగా ఆడుతూనే ఉన్నాడని, ఇప్పుడు తన 100వ మ్యాచ్‌కు రంగం సిద్ధం అయిందని, ఇదొక అద్భుతమైన అనుభవం అని అన్నాడు.


2018లో ఆస్ట్రేలియాపై 2-1తో విజయం సాధించినప్పుడు కోహ్లీ కెరీర్‌లోనే అత్యుత్తమ దశలో ఉన్నాడని అభిప్రాయపడ్డాడు. ఇక విరాట్ సాధించిన 27 టెస్టు శతకాల్లో తన ఫేవరెట్ సెంచరీని కూడా తెలిపాడు. 2013 దక్షిణాఫ్రికా పర్యటనలో జొహాన్నెస్‌బర్గ్‌లో సాధించిన శతకం తన దృష్టిలో కోహ్లీ అత్యుత్తమ శతకం అని పేర్కొన్నాడు.


ఆ మ్యాచ్‌లో పిచ్ ఎంతో కష్టంగా ఉన్నప్పటికీ విరాట్ అద్బుతంగా ఆడాడని, దీంతపాటు డేల్ స్టెయిన్, మోర్నీ మోర్కెల్, వెర్నాన్ ఫిలాండర్, జాక్వెస్ కలిస్ వంటి బౌలర్లను ఎదుర్కొంటూ ఈ శతకం సాధించాడని పొగడ్తల్లో ముంచెత్తాడు. ఇక విరాట్ ఆ మ్యాచ్‌లో మొదటి శతకం సాధించగా, రెండో ఇన్నింగ్స్‌లో 96 పరుగులు సాధించాడు.


2018లో విరాట్ పెర్త్‌లో సాధించిన శతకం కూడా తన ఫేవరెట్ ఇన్నింగ్స్‌లో ఒకటి అన్నాడు. కానీ రెండిట్లో ఒకదాన్ని ఎంచుకోవాలంటే జొహాన్నెస్‌బర్గ్ ఇన్నింగ్స్ వైపే మొగ్గు చూపాడు.