Pew study: అమెరికన్ పరిశోధకులు ఇటీవల చేసిన అధ్యయనం ప్రకారం, "భార్య ఎప్పుడూ తన భర్తకు కట్టుబడి ఉండాలి" సంప్రదాయాలు పాటిస్తూ పురుషులకు మద్దతు ఇవ్వాలి అనే భావనతో ఎక్కువ మంది భారతీయులు(Indians) అంగీకరిస్తున్నారని తెలింది. ప్యూ రీసెర్చ్ సెంటర్(Pew Research Center) బుధవారం విడుదల చేసిన నివేదికలో భారతీయులు ఇంట్లో, సమాజంలో మహిళలను సాధారణంగా ఎలా చూస్తారు. COVID-19 మహమ్మారికి ముందు, 2019 చివరి నాటికి 2020 ప్రారంభంలో 29,999 మంది భారతీయులను ముఖాముఖిగా సర్వే చేసి ఈ నివేదిక రూపొందించారు. ఈ నివేదికను భారతదేశంలో ఇటీవల మతంపై చేసిన ఓ సర్వే ఆధారంగా కూడా రూపొందించారు. ఈ సర్వేను 17 భాషల్లో భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు(States), కేంద్రపాలిత ప్రాంతాలలో నిర్వహించారు. 


స్త్రీ-పురుషులకు సమాన హక్కులు


"భారతీయులు దాదాపుగా విశ్వవ్యాప్తంగా స్త్రీలకు పురుషులతో సమానమైన హక్కులను కలిగి ఉండటం చాలా ముఖ్యమని చెప్పారు. పది మందిలో ఎనిమిది మంది ఇది చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు.  అయితే అదే సమయంలో పురుషులకు ప్రాధాన్యత ఇవ్వాలని భారతీయులు భావించారు." అని నివేదిక(Report) పేర్కొంది. కొన్ని ఉద్యోగాలలో స్త్రీల కంటే పురుషులకు ఎక్కువ హక్కులు ఉండాలనే అనే ఆలోచనతో 80 శాతం మంది అంగీకరించారు. దాదాపు తొమ్మిది మందిలో పది మంది భారతీయులు (87%) భార్య ఎప్పుడూ తన భర్తకు కట్టుబడి ఉండాలనే భావనతో ఎక్కువ మంది అంగీకరిస్తున్నారు. ఇందులో మెజారిటీ ఇండియన్స్ (64%) ఈ సెంటిమెంట్‌తో పూర్తిగా ఏకీభవిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భార్యలు తమ భర్తలకు విధేయత చూపాలన్న భావనతో పురుషుల కంటే స్త్రీలు తక్కువగా ఉన్నారు. ఈ అభిప్రాయంతో 61 శాతం మహిళలు ఉంటే, 67 శాతం మగవారు ఈ భావనంతో ఉన్నారని సర్వేలో తెలింది.  


రాజకీయాల్లో మహిళలకు అగ్రస్థానం


మాజీ ప్రధాని ఇందిరా గాంధీ(Indira Gandhi), తమిళనాడు మాజీ సీఎం జయలలిత(Jayalalitha), పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Benarjee), మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో సహా భారత రాజకీయాల్లో కీలకమైన మహిళా రాజకీయ ప్రముఖులను ప్రస్తావిస్తూ, భారతీయులు రాజకీయ నాయకులుగా మహిళలను విస్తృతంగా అంగీకరిస్తారని నివేదిక పేర్కొంది.  సర్వే ఫలితాలు రాజకీయాల్లో మహిళలకు ఉన్న అవకాశాలను తెలుపుతోంది. రాజకీయాల్లో స్త్రీలు, పురుషులు సమానమేనని 55% మంది అభిప్రాయపడ్డారు. స్త్రీలు సాధారణంగా పురుషుల కంటే మంచి నాయకులు అని 14% మంది భావించారు. భారతీయులలో నాలుగింట ఒక వంతు మంది మాత్రమే పురుషులు స్త్రీల కన్నా మెరుగైన రాజకీయాలు చేస్తారని అభిప్రాయపడ్డారని అధ్యయనం పేర్కొంది.


అంత్యక్రియల బాధ్యత


సర్వేలో పురుషులు, మహిళలు కుటుంబ బాధ్యతలను పంచుకోవాలని చెబుతున్నప్పటికీ, చాలామంది ఇప్పటికీ సంప్రదాయలు పాటించాలన్న అభిప్రాయలు వ్యక్తం చేశారు. పిల్లల విషయానికి వస్తే ఒక కుటుంబానికి కనీసం ఒక కొడుకు (94%), ఒక కుమార్తె (90%) కలిగి ఉండటం చాలా ముఖ్యం అనే అభిప్రాయంలో భారతీయులు ఏకీభవించారు. చాలా మంది భారతీయులు (63%) కుమారులు ప్రధానంగా తల్లిదండ్రుల అంత్యక్రియల(Funeral Rites) బాధ్యత వహించాలని చెప్పారు. ముస్లింలు (74%), జైనులు (67%), హిందువులు (63%) అంత్యక్రియల బాధ్యత కుమారులదేనని భావిస్తున్నారు. అయితే సిక్కులు (29%), క్రైస్తవులు (44%), బౌద్ధులు (46%) కుమారులు, కుమార్తెలు ఇద్దరు అంత్యక్రియల బాధ్యత వహించాలని భావిస్తున్నారు. కుటుంబాలలో సంప్రదాయ పద్దతులు పాటించాలని ముస్లింలు ఎక్కువగా భావిస్తున్నారు. అయితే సిక్కులు తరచుగా అలాంటి అభిప్రాయాలను అతి తక్కువగా కలిగి ఉన్నారని అధ్యయనంలో తేలింది.