ఫేస్ గ్లో కోసం ఫేస్ ప్యాక్ చేయించుకోవడానికి వెళ్తే చిట్టీల ప్యాకేజీ చెప్పిందో మహిళ. నెల నెల కడితే లైఫ్‌లో ఉపయోగపడతాయని కలరింగ్ ఇచ్చింది. ఓన్లీ మౌత్ టాక్ ద్వారానే కోట్లలో వ్యాపారం చేసింది. చివరకు నష్టపోయానంటూ ఊరి నుంచే జంప్ అయింది.
అనంతపురంలో చీటీల పేరుతో మహిళలను మోసం చేసిన సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. ఈసారి వంతు బ్యూటీపార్లర్‌కు వచ్చిన మహిళలది. అనంతపురంలోని సాయి నగర్‌లో జయలక్ష్మి అనే మహిళ బ్యూటీపార్లర్ నిర్వహిస్తూ అందరని మంచి చేసుకుంది. కొన్నేళ్లుగా చిట్టీలు వేస్తూ నమ్మకంగా నడిపింది. రెట్టింపు చిట్టీలు కట్టించుకొని ఓ రాత్రి ఎస్కేప్ అయింది.
కడపకు చెందిన జయలక్ష్మి గత పదహారు సంవత్సరాలుగా అనంతపురంలోని సాయినగర్‌లో బ్యూటీపార్లర్ నిర్వహిస్తూ ఉండేది. తన పార్లర్‌కు వచ్చిన మహిళలతో సానిహిత్యం పెంచుకుంది. ఇంటి అవసరాలకు ఉపయోపడతాయన్న కారణంతో చాలా ఏళ్ల క్రితమే ఆమె చిట్టీలు వేద్దామని ప్రతిపాదన తీసుకొచ్చింది. స్థానిక మహిళలు కూడా ఆసక్తి చూపారు. మొదట వందల రూపాయలతో మొదలైన చిట్టీలు క్రమంగా లక్షలు, కోట్లకు వెళ్లిపోయాయి.
జయలక్ష్మీ కలర్‌ఫుల్ పిక్చర్‌కు కొన్నేళ్ల పాటు భారీగా కలెక్షన్లు వచ్చాయి. ఇలా సాగిపోతున్న చిట్టీల వ్యాపారంలో ఒక్కసారిగా కుదుపు వచ్చింది. డబ్బులు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. వచ్చిన వాళ్లకు ఏదో ఒకటి చేసి పంపించేస్తూ కాలం నెట్టుకొచ్చింది జయలక్ష్మీ. రోజురోజుకు పరిస్థితి దిగజారింది. రోజు చిట్టీ వేసిన సభ్యులు వచ్చి ఇంటి వద్ద గొడవ పడటంతో జయలక్ష్మీ ఫ్యామిలీ తట్టుకోలేకపోయింది.
ఒత్తిడి పెరిగిపోవడంతో జయలక్ష్మి రాత్రికిరాత్రకే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయేందకు ప్రయత్నించింది. విషయం తెలుసుకొన్న భాదితులు అడ్డుకొని లారీలో ఉన్న విలువైన సామానులను తీసుకెళ్లారు. ఈ విషయంపై గతంలో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
పోలీసులు దర్యాప్తు చేసే సమయంలో జయలక్ష్మీ ఎస్కేప్ అయింది. దీంతో పోలీసులపై ప్రెజర్ ఎక్కువైంది. జయలక్ష్మి, ఆమె భర్తపై అనంతపురం టూటౌన్, ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యాయి. ఇన్ని కేసులు నమోదు అవుతున్నా నిందితులను పట్టుకోకపోవడంతో పోలీసులపై చాలామందికి అనుమానం వచ్చింది.
దర్యాప్తు తీవ్రం చేసిన పోలీసులు అహోబిలంలో జయలక్ష్మి, ఆమె భర్త శ్రీహరి బాబు ఉన్నట్టు గుర్తించి అరెస్టు చేశారు. ఇద్దరిని అనంతపురం దిశ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు. నిందితులు దొరికినా చిట్టీలు కట్టిన బాధితులకు న్యాయం జరుగుతుందా లేదా అన్న సస్పెన్స్ ఇప్పుడు టెన్షన్ పెడుతోంది.
ఇప్పటికే డబ్బులు కోల్పోయి ఆందోళనలో ఉన్న బాధితులు ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి వరకు వెయిట్ చేసినా డబ్బులు అందుతాయా లేదా అన్న భయాందోళనలు నెలకొన్నాయి వారిలో. ఎన్నిసార్లు ఎంతమంది చిట్టీల వ్యాపారుల మోసాలకు బలవుతున్నా ఇంకా జనాల్లో మార్పు రాకపోవడం లేదంటున్నారు పోలీసులు. ఎవరికి పడితే వాళ్లను నమ్మేసి చిట్టీలు కొట్టి సమస్యలు కొని తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు.
బాధితుల వివరాలు సేకరించిన పోలీసులు ఎవరెవరు ఎంత నష్టపోయారు అన్నది ఆరా తీస్తున్నారు. ఆ వివరాలను నిందితులు చెప్పిన మసాచారంతో కూడా క్రాస్ చెక్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే కేసులు కొలిక్కి వస్తుందని చెబుతున్నారు పోలీసులు.