UEFA Mens Champions League 2022: రష్యా - ఉక్రెయిన్ యుద్ధం (Russia Ukrain War) నేపథ్యంలో యురోపియన్ ఫుట్‌బాల్ సంఘం (UEFA) కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరగాల్సిన 2022 ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ వేదికను మార్చింది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో తుది పోరును నిర్వహించేందుకు సిద్ధమైంది. షెడ్యూలు ప్రకారం మే 28న సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని గాజ్‌ప్రామ్ ఎరీనాలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది.
యూఈఎఫ్ఏ వేదిక మార్పు
'2021-22 యూఈఎఫ్‌ఏ పురుషుల ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ వేదికను సెయింట్ పీటర్స్ బర్గ్ నుంచి సెయింట్ డెన్నిస్‌లోని స్టేడ్ డి ఫ్రాన్స్‌కు మార్చాలని యూఈఎఫ్‌ఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది. మ్యాచ్ ముందుగానే నిర్ణయించినట్టుగా మే 28, శనివారం జరుగుతుంది. యూరోపియన్ ఫుట్‌బాల్ క్లబ్ నిర్వహించే అత్యంత ప్రతిష్ఠాత్మక మ్యాచును ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఫ్రాన్స్‌కు మార్చేందుకు అనుమతించిన అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌కు ధన్యవాదాలు' అని యూఈఎఫ్‌ఏ తెలిపింది.
రష్యా యుద్ధంతో
ఉక్రెయిన్‌పై (Ukrain) గురువారం నుంచి పూర్తి స్థాయి సైనిక చర్యను రష్యా ఆరంభించింది. ఈ వివాదం గురించి ఫిఫాకు మూడు ఫుట్‌బాల్ క్లబ్బులు తమ ఆందోళన తెలియజేశాయి. రష్యాలో నిర్వహించే 2022 ఫుట్‌బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచులను (Fifa world cup qualifiers matches) రద్దు చేయాలని కోరాయి. వివాదం నేపథ్యంలో ఛాంపియన్స్ లీగ్ ఫైనల్‌ను రష్యా నుంచి మార్చాలని ఇంతకు ముందే బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ డిమాండ్ చేశారు. ఆ దేశంలో జరిగిన ప్రతి క్రీడా ఈవెంట్‌ను రద్దు చేయాలని ప్రపంచ క్రీడా సంఘాలను ఆస్ట్రేలియా కోరింది.
ఎఫ్1 రేసు కూడా
రష్యాలోని సోచిలో ఈ ఏడాది రష్యన్ గ్రాండ్ ప్రి (Russian Grand Prix) జరగాల్సి ఉంది. ఇప్పటికైతే ఈ ఈవెంట్ గురించి ఫార్ములా వన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ క్రీడా కార్యక్రమాన్ని దాదాపుగా రద్దు చేస్తారని తెలుస్తోంది. రేసు నిర్వహిస్తే తమకు చెడ్డపేరు వస్తుందని సంఘం భావిస్తోన్నట్టు తెలిసింది.