IND vs SL Rahul Dravid: టీమ్‌ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను చాలామంది స్థితప్రజ్ఞుడు అంటారు! ఎందుకంటే అన్నిటినీ అతడు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడు. అవసరమైతే కఠిన విషయాలనూ అవతలి వారికి చెబుతాడు. అనవసరంగా నవ్వడు. అవసరమైన సమయంలో సరదాగా ఉంటూనే పని విషయంలో సీరియస్‌గా ఉంటాడు. అందుకే శ్రీలంకతో జరిగిన మ్యాచులో ద్రవిడ్ పలికించిన హావభావాలకు అంతా ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
లంకేయులు తీసుకున్న ఓ డీఆర్‌ఎస్ విజయవంతం కావడంతో ద్రవిడ్ చిరునవ్వలు చిందించాడు. అప్పుడాయన పలికించిన ఎక్స్‌ప్రెషన్స్ చూసి అంతా ఆనందిస్తున్నారు. నిజానికి సర్‌ప్రైజ్ అయ్యారు. జట్టు స్కోరు 28/2 వద్ద 7 పరుగులతో ఉన్న చరిత్ అసలంకను యుజ్వేంద్ర చాహల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. పిచైన బంతి అసలంక ప్యాడ్లను తాకుతూ వెళ్లింది. వెంటనే చాహల్ బిగ్గరగా అరుస్తూ అప్పీల్ చేశాడు. ఆలోచిస్తూనే అంపైర్ వీరేందర్ శర్మ మెల్లగా తన చేతిని పైకెత్తాడు.
టీమ్‌ఇండియా సంతోషంతో సంబరాలు చేస్తుండటంతో అసలంక తన సహచరుడు జనిత్ లియనాగ్‌ను అడిగి రివ్యూ తీసుకున్నాడు. సమీక్షలో బంతి ప్యాడ్లను తాకడానికి ముందే బ్యాటు అంచును తాకినట్టు తేలింది. కొద్దిపాటి స్పైక్ వచ్చినట్టు కనిపించింది. దాదాపుగా అసలంక ఔటవుతాడని ద్రవిడ్ ఊహించాడు. ఆసక్తిగా భారీ స్క్రీన్‌ను చూస్తూనే ఉన్నాడు. నాటౌట్ అని రాగానే అయ్యో అనుకుంటూ విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు. అవన్నీ వీడియోలో రికార్డవ్వడంతో అభిమానులు చిరునవ్వులు చిందించారు. సాధారణంగా ద్రవిడ్ ఎప్పుడూ అలా కనిపించడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఇక శ్రీలంకతో జరిగిన మొదటి టీ20లో టీమిండియా (Team India) 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇషాన్ కిషన్ (89; 56 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లు) (Ishan Kishan), శ్రేయస్ అయ్యర్ (57 నాటౌట్; 28 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) (Shreyas iyer) చెలరేగడంతో 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో చరిత్ అసలంక (53 నాటౌట్: 47 బంతుల్లో, ఐదు ఫోర్లు) అర్థ సెంచరీ సాధించాడు.