తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్(Bheemla Nayak) మానియా నడుస్తోంది. థియేటర్ల వద్ద పవన్ అభిమానులు సందడి చేస్తున్నాయి. ఏపీలో బెనిఫిట్ షో, 5వ షోకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. టికెట్లు అధికరేట్లకు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని ఆదేశాలు జారీచేసింది. థియేటర్ల వద్ద ఎమ్మార్వో(MRO), వీఆర్వో(VRO)లను నిఘా పెట్టింది. భీమ్లా నాయక్ సినిమాకు ఏపీ ప్రభుత్వ ఆంక్షలతో ఇబ్బంది కలిగిస్తుందని పవన్ అభిమానులు(Pawan Fans) ఆరోపిస్తున్నారు. కర్నూలు నగరంలో థియేటర్ల వద్ద అభిమానుల సందడి లేకుండా చేసేందుకు పోలీసులను మోహరించారు. సినిమా ప్రదర్శన అవుతున్న అన్ని థియేటర్ల వద్ద పోలీసులు అభిమానులను థియేటర్(Theatre) నుంచి పంపిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే పవన్ ను టార్గెట్ చేసిందని అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 



ప్రభుత్వం జోక్యం ఎందుకు?


ఎమ్మార్వోలకి, వీఆర్వోలకి సినిమా థియేటర్ల దగ్గర ఏం పని..? నెల్లూరులో పవన్ కల్యాణ్ అభిమానులు అడుగుతున్న ప్రశ్నలివి. అసలు సినిమాల విషయంలో ప్రభుత్వం జోక్యం ఎందుకు? బెనిఫిట్ (Benifti Show)షోలు లేకుండా అభిమానులను నిరాశకు గురి చేయడం న్యాయమేనా అంటున్నారు. మరికొందరు అభిమానులు తమ బ్యానర్లు చించేస్తున్నారంటూ గొడవకు దిగారు. కనీసం పవన్ కటౌట్ కి పాలాభిషేకం చేయడానికి కూడా అనుమతివ్వలేదని అంటున్నారు. 







థియేటర్లపై నిఘా 


విజ‌య‌వాడ(Vijayawada) సినిమా థియేటర్ల వ‌ద్ద ప‌వ‌న్ ఫ్యాన్స్ సంద‌డి భారీగా నెల‌కొంది. అన్ని థియేట‌ర్లలోనూ ఈ రోజు భీమ్లా నాయ‌క్ చిత్రాన్ని ప్రద‌ర్శిస్తున్నారు. దీంతో అభిమానులు డ‌ప్పు విన్యాసాల‌తో థియేట‌ర్ల వద్ద నృత్యాలు చేస్తున్నారు. అటు పోలీసులు, రెవిన్యూ అధికారులు కూడా థియేట‌ర్లపై ప్రత్యేక నిఘా చేస్తున్నారు. థియేట‌ర్ల వ‌ద్ద అభిమానుల‌ను నిలువ‌రిస్తున్న పోలీసుల తీరుకు నిర‌స‌న‌గా అభిమానులు పోలీసు వాహ‌నాల ముందు ప‌డుకొని నిర‌స‌న తెలిపారు. పోలీసులు వారిని బ‌ల‌వంతంగా తొలిగించారు. సినిమా టిక్కెట్లు(Cinema Tickets) ఎంత త‌గ్గిస్తే అన్ని రెట్లు ఎక్కువ‌గా సినిమా చూస్తామంటున్నారు ప‌వ‌న్ అభిమానులు.


మంత్రులకు పవన్ అభిమానుల సెగ 


మంత్రులు కొడాలి నాని(Kodali Nani), పేర్ని నాని(Perni Nani)లకు  కృష్ణాజిల్లా గుడివాడలో పవన్ కల్యాణ్ అభిమానుల సెగ తగిలింది. పట్టణంలోని జీ-3 భాస్కర్ థియేటర్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న  మంత్రి పేర్ని నాని, కొడాలి నానిలను అడ్డుకునేందుకు పవన్ అభిమానులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. థియేటర్ లో భీమ్లా నాయక్ చిత్రం ప్రదర్శించడంతో పెద్దసంఖ్యలో అభిమానులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. జి-3 థియేటర్ వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్న గుడివాడ జనసేన పార్టీ ఇంఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ తో పాటు పలువురు అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన్ కల్యాణ్ సినిమాలను కక్ష పూరితంగా అడ్డుకోవడం దారుణమని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.