AP Theaters Issue: సినిమా టికెట్ల వ్యవహారంలో ప్రభుత్వం కఠినంగా ఉన్నా సినిమా హాళ్ల యాజమాన్యాలు, నిర్వహకులు కొన్ని చోట్ల తమ చేతివాటం చూపిస్తున్నారు. ఆన్ లైన్లో టికెట్లు పెట్టిన 5 నిమిషాల్లోనే అన్నీ అయిపోతున్నాయి. కౌంటర్లో టికెట్ సేల్స్ అస్సలు ఉండవు. దాదాపుగా అన్నీ బ్లాక్ లోనే దర్శనమిస్తున్నాయి. అభిమానులు ఎంత రేటు పెట్టయినా కొంటారులే అనే దీమాతో బ్లాక్ లోనే టికెట్లు సేల్ చేస్తున్నారు. మరోవైపు కొంతమంది అభిమానులు తమకు టికెట్లు అందడం లేదని గొడవ చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
ఫుడ్ కూపన్ కొనాల్సిందేనా..?
నెల్లూరులోని స్పైస్ సినిమా థియేటర్లలో భీమ్లా నాయక్ సినిమా టికెట్ కొనాలంటే ఫుడ్ కూపన్ కూడా కొనాల్సిందే అంటున్నారని కొంతమంది అభిమానులు గొడవ చేస్తున్నారు. సినిమా టికెట్ రూ.250, ఫుడ్ కూపన్ రూ.120 ఇదెక్కడి బాదుడని వాపోతున్నారు. సినిమా టికెట్ కొన్నవాళ్లు టికెట్ తోపాటు ఫుడ్ కూపన్ కూడా వాట్సప్ గ్రూపుల్లో పెడుతూ థియేటర్ల బాదుడిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం టికెట్ రేట్లు తగ్గించినా ఏం లాభం లేదని, థియేటర్ల యాజమాన్యాలు ఇలా తమ ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నాయని అంటున్నారు.
అదంతా అవాస్తవం..
గతంలో కూడా పెద్ద సినిమాల విడుదల సమయంలో ఇలాంటి ఘటనలే జరిగాయి. సినిమా టికెట్ తోపాటు ఫుడ్ కూపన్ కూడా అంటగడుతున్నారనే ప్రచారం జరిగింది. అయితే యాజమాన్యాలు మాత్రం అలాంటిదేమీ లేదని, ఫుడ్ కూపన్ కంపల్సరీ కాదని అంటున్నాయి. ఇప్పుడు కూడా భీమ్లా నాయక్ రిలీజ్ టైమ్ లో ఇదే ప్రచారం జరిగింది. దీంతో మరోసారి యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. ఫుడ్ కూపన్ కంపల్సరీ కాదంటోంది. ఇష్టం ఉన్నవారు మాత్రమే ఫుడ్ కూపన్ తీసుకుంటున్నారని, కానీ కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంటున్నారు థియేటర్ ప్రతినిధులు.
టికెట్లకోసం నెల్లూరులో రచ్చ రచ్చ..
భీమ్లా నాయక్ సినిమా విడుదలైనా బెనిఫిట్ షో లు లేకపోవడంతో థియేటర్ల వద్ద గొడవ మామూలుగా లేదు. నెల్లూరు నగరంలో రానా ఫ్యాన్స్ కొంతమంది టికెట్లకోసం గొడవకు దిగారు. టికెట్లన్నీ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కే ఇచ్చేస్తున్నారని అన్నారు. దగ్గుబాటి ఫ్యాన్స్ కి టికెట్లు లేవా అని ప్రశ్నించారు.
కావలిలో ఫ్యాన్ వార్..
అటు కావలిలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైంది. తమది అసలైన ఫ్యాన్స్ అసోసియేషన్ అని, ఇటీవల కొంతమంది సినిమా కోసం ఫ్యాన్స్ అసోసియేషన్ సృష్టించారని, థియేటర్ల యజమానులు వారికే టికెట్లు ఇస్తున్నారంటూ గడవకు దిగారు. ఏకంగా ఈ వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.
పోలీసులకు కూడా ఏంచేయాలో అర్థం కాలేదు. మొత్తమ్మీద నెల్లూరులో భీమ్లా నాయక్ విడుదల సందర్భంగా సందడితోపాటు.. టికెట్లకోసం గొడవలు కూడా ఓ రేంజ్ లో జరుగుతున్నాయి.