హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఓ యువతి అనుమానాస్పద రీతిలో చనిపోయి ఉండడం స్థానికంగా కలకలం రేపింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ ఘటన జరిగింది. ఈ యువతి చనిపోయిన ఘటనపై బంధువులు, కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎవరో హత్య ఉంటారని, దాన్ని అనుమానాస్పద మృతిగా చిత్రీకరిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. చందానగర్ పోలీసులు వెల్లడించిన వివరాలు ఇవీ..


హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి దూబేకాలనీకి చెందిన వెంకటాచారి వడ్రంగిగా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కరోనా మహమ్మారి కారణంగా వైరస్ సోకడంతో ఏడాదిన్నర క్రితం ఆయన మృతి చెందాడు. అతనికి భార్య ఉమారాణి, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కుమార్తెకు పెళ్లి కాగా మొయినాబాద్‌లో ఉంటోంది. చిన్న కుమార్తె సౌజన్య బాచుపల్లిలోని ఓ కళాశాలలో బీ టెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో పెద్ద కుమార్తె ఆరోగ్యం సరిగా లేకపోవడంతో.. ఆమెను చూసుకోవడం కోసం తల్లి పెద్ద కుమార్తె ఇంటికి మొయినాబాద్‌కు వెళ్లింది. దీంతో ఆ రోజు చిన్న కుమార్తె ఇంట్లో ఒంటరిగా ఉంది. 


అదే సమయంలో ఆమె ఇంటికి ఓ ఓ వ్యక్తి వచ్చాడు. కొద్ది సేపటి తర్వాత సౌజన్య గట్టిగా అరిస్తూ కేకలు పెట్టిందని ఇంటిపైన అద్దెకు ఉంటున్నవారు తెలిపారు. కిందికి వచ్చి చూడగా.. ఆ వ్యక్తి వెంటనే బయటికి వచ్చి.. డాక్టర్‌ను పిలుచుకొని వస్తానని వెళ్లిపోయాడు. దీంతో ఆమెను స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ కు విషయం తెలపగా.. పరీక్షించిన వైద్యుడు అప్పటికే ఆమె చనిపోయినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లి లబోదిబోమంటూ చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.


బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు. సౌజన్య ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చిన వ్యక్తి విజయ్‌ అని పోలీసులు గుర్తించారు. విజయ్ స్థానికంగా ఓ సంస్థ నిర్వహిస్తున్నాడు. 8 నెలల ముందు సౌజన్య అక్కడ ఉద్యోగం చేసింది. కాలేజీకి వెళ్లాలని ఉద్యోగం మానేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సౌజన్య మృతిపై వారు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ హత్యేనని ఆరోపిస్తున్నారు. విజయ్‌ ఇంటికి తాళం వేసి ఉందని, అతడిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.


సౌజన్య మృతిపై వారు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం ఇంట్లోకి విజయ్‌ రెండు సార్లు వచ్చి వెళ్లాడని.. ఉరేసుకున్నట్లు చిత్రీకరించడానికి చీరను కత్తితో చింపినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. గతంలో కూడా ఆమెను అతను వేధించాడని ఆమె తల్లి తెలిపింది. ఇది ముమ్మాటికీ హత్యేనని.. ఘటన జరిగాక విజయ్‌ స్థానికంగానే తిరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోలేదని చనిపోయిన యువతి తల్లి అన్నారు.