China On Russias Military Operation:  ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యలను అమెరికా సహా ప్రపంచంలోని పలు దేశాలు దాడి, ఆక్రమణగా అభివర్ణించాయి. కానీ చైనా వైఖరి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన సైనిక చర్యను దాడి, ఆక్రమణ అని పిలిచేందుకు చైనా నిరాకరించింది. అలా పిలిస్తే కేవలం అది పక్షపాత ధోరణికి నిదర్శనమని తమ మిత్ర దేశం రష్యాకు పరోక్షంగా చైనా వత్తాసు పలికింది. ఉక్రెయిన్ ప్రజలను కాపాడేందుకు మాత్రమే తాము ఆర్మీని రంగంలోకి దించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం ఉదయం స్వయంగా ప్రకటించారు.


తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్రత కల్పిస్తున్నట్లు వ్లాదిమిర్​ పుతిన్‌ ఇటీవల ప్రకటించారు. డొనెట్స్క్‌, లుహాన్స్క్‌లను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తామని పుతిన్ ప్రకటించడం.. ఈ నిర్ణయాన్ని ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఈ విషయంలో మొదలైన విభేదాలు యుద్ధానికి దారితీశాయి. మరోవైపు ఆ ప్రాంతాలు తమకు రష్యా ఆర్మీ సాయాన్ని కోరడంతో రష్యా తమ చివరి ప్రయత్నంగా యుద్ధానికి వెళ్లి దాడులు మొదలుపెట్టింది. ఉక్రెయిన్ సైతం రష్యా దాడులను తిప్పికొట్టే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. రష్యాతో యుద్దం జరుగుతున్నందున ఉక్రెయిన్‌ వ్యాప్తంగా అన్నిప్రాంతాల్లోనూ 30 రోజులపాటు ఎమెర్జెన్సీ విధిస్తున్నట్లు ఉన్నతా భద్రతాధికారి వెల్లడించారు.


ఉక్రెయిన్‌పై దాడి నిలిపివేయాలని పలు దేశాలతో పాటు ఐక్యరాజ్యసమితి సైతం సూచించింది. కానీ చైనా మాత్రం ఉక్రెయిన్ పై రష్యా ఆర్మీ ఆపరేషన్‌ను దాడికి పిలవలేమని క్లారిటీ ఇచ్చింది. ఇరు దేశాలు సంయమనం పాటించి పరిస్థితులు సాధారణంగా మారేందుకు యత్నించాలని చైనా విదేశాంగ శాఖ మంత్రి హువా చునియింగ్ పేర్కొన్నారు. రష్యా చర్యలను దాడిగా పేర్కొన్నలేమని, అలా పిలిచామంటే అది కేవలం పక్షపాత ధోరణిని ప్రదర్శించడమంటూ భిన్నంగా స్పందించింది చైనా. యుద్ధాన్ని నివారించడానికి ఏమైనా చర్యలు తీసుకుంటారా, ఉక్రెయిన్, రష్యా దేశాల అధినేతలతో చర్చిస్తారా అనే ప్రశ్నలకు మాత్రం ఆయన సమాధానం ఇవ్వలేదు.


ఉక్రెయిన్ సంక్షోభం తాజాగా తలెత్తింది కాదని, అందుకు ఎన్నో కారణాలు ఉన్నాయని చైనా చెబుతోంది. కానీ విదేశాలు ఈ విషయాన్ని ప్రస్తుతం పెద్దవిగా చేసి చూస్తున్నారని, ఉక్రెయిన్ సంక్షోభానికి చారిత్రక నేపథ్యం ఉందని చైనా ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ పై రష్యా ఫిబ్రవరిలోనే దాడి చేసే అవకాశం ఉందని అగ్రరాజ్యం అమెరికా ప్రకటన చేసింది. అలాంటి ఉద్దేశమే లేదని చెబుతూ వచ్చిన రష్యా ఒక్కసారి తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలపై సైనిక చర్యకు దిగింది. దేశాన్ని ఆక్రయించుకునే ఉద్దేశం తమకు లేదని పుతిన్ అన్నారు. కేవలం అక్కడి పౌరులను కాపాడేందుకు ఆర్మీని రంగంలోకి దించామని స్పష్టం చేశారు. 


Also Read: Ukraine Russia Conflict: ఉక్రెయిన్‌లో 30 రోజుల పాటు ఎమర్జెన్సీ- రష్యాతో ఉద్రిక్తతల వేళ కీలక నిర్ణయం 


Also Read: Russia Ukraine Crisis: రష్యాపై ఆంక్షల కొరడా ఝుళిపించిన అమెరికా- పుతిన్‌ దూకుడు ఆపుతారా?