Paralysis With Diabetes | శరీరం సహకరిస్తేనే ఎంత గొప్పగా బతికేదైనా. చేయీ కాలూ పనిచేయకపోతే ఎన్ని ఆస్తులున్నా, సంపదలున్నా ఒకరిమీద ఆధారపడాల్సిందే. చెట్టంత మనిషిని కుదేలుచేసే పక్షవాతం వచ్చిందా... చేయి, కాలు పైనే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. మనిషిని మంచాన పడేస్తుంది. అలాంటి పక్షవాతం వచ్చిందా జీవితం సగం ముగిసినట్టే అనిపిస్తుంది. అందుకే పక్షవాతం బారిన పడకుండా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. 


మధుమేహంతో ముప్పు
కొన్ని అధ్యయనాల ప్రకారం మధుమేహం ఉన్నవారిలో పక్షవాతం వచ్చే అవకాశం ఒకటిన్నర రెట్లు ఎక్కువ.గ్లూకోజు స్థాయిలు ఎక్కువగా ఉండేవారిలో రక్తనాళాలు, నాడులు దెబ్బతినే అవకాశం అధికం. అదే జరిగితే పక్షవాతం వస్తుంది. అందుకే వారు గ్లూకోజు స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి. అంతేకాదు మధుమేహులకు పక్షవాతం వస్తే కోలుకోవడమం కూడా కష్టమే. డయాబెటిస్ లేనివారు చికిత్స ద్వారా ఎంతో కొంత కోలుకుంటారు. మధుమేహుల్లో రక్తపోటు, రక్తంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటాయి. వారు బరువు కూడా అధికంగానే ఉంటారు. ఈ కారణాలు కూడా పక్షవాతం ముప్పును పెంచుతాయి. కాబట్టి బరువును, గ్లూకోజుస్థాయిలను అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 
 
హైబీపీ ఉన్నా ప్రమాదమే
కేవలం మధుమేహులకే కాదు హైబీపీతో కూడా పక్షవాతం ముప్పు పొంచి ఉంది. ఇక మధుమేహం, హైబీపీ రెండూ ఉన్న వాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. రక్తపోటు 120/80 మించకుండా చూసుకోవాలి. అందుకోసం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవరచుకోవాలి. 


ఇవి కూడా కారణాలే...
గుండెలయ తప్పే ఆరోగ్యసమస్య ఏట్రియల్ ఫిబ్రిలేషన్. ఇది ఉన్న వాళ్లలో పక్షవాతం వచ్చే ముప్పు అయిదు రెట్లు అధికంగా ఉంటుంది. గుండె వేగంగా కొట్టుకుంటున్నట్టు అనిపించినా, లేక గుండె లయ సరిగా లేనట్టు అనిపించినా తేలికగా తీసుకోవద్దు. వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం అత్యవసరం. చాలా మంది రక్తపోటు అదుపులోకి రాగానే మందులు ఆపేస్తారు. మధుమేహం విషయంలో కూడా అలాగే చేస్తారు. ఇలా చేస్తే కోరి మరీ ముప్పును తెచ్చుకున్నట్టే. జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితులు అవి. ఎప్పడూ ఆపకూడదు. మద్యపానం, ధూమపానం అలవాటు వల్ల రక్తనాళాలు సంకోచించడం, అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల పక్షవాతం వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి ఆ చెడు అలవాట్లను వదిలివేయాలి. 


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.


Also read: కోవిడ్ తగ్గాక రెండేళ్ల బాబుకి కార్డియాక్ అరెస్టు, పోస్టు కోవిడ్ లక్షణాలను తేలికగా తీసుకోవద్దు


Also read: వారానికోసారి బోన్ సూప్, తాగితే అందం ఆరోగ్యం కూడా, ఇదిగో సింపుల్ రెసిపీ