2021 అండర్-19 ఆసియాకప్‌ను టీమిండియా సొంతం చేసుకుంది. శ్రీలంకతో జరిగిన ఫైనల్స్‌లో భారత్ ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 38 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 38 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. భారత్ లక్ష్యాన్ని 102 పరుగులకు సవరించగా.. 21.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి ఛేదించింది. ఇప్పటివరకు తొమ్మిది ఆసియా కప్ టోర్నీలు జరగ్గా.. భారత్ ఏడుసార్లు కప్ గెలుచుకుంది. ఆఫ్ఘనిస్తాన్ ఒకసారి కప్‌ను ముద్దాడగా.. ఒక ట్రోఫీలో మాత్రం భారత్, పాకిస్తాన్ సంయుక్త విజేతలుగా నిలిచాయి. అంటే మొత్తంగా ఎనిమిది సార్లు భారత్ విజయం సాధించిందన్న మాట.
మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టులో కేవలం నలుగురు మాత్రమే రెండంకెల స్కోరును చేరుకున్నారు. వీరిలో ముగ్గురు.. టెయిలెండర్లే. యసిరు రోడ్రిగో(19: 26 బంతుల్లో, రెండు ఫోర్లు) టాప్ స్కోరర్. టాప్-7 బ్యాట్స్‌మెన్‌లో కేవలం సదిశ రాజపక్స (14: 36 బంతుల్లో, ఒక ఫోర్) మాత్రమే రెండంకెల స్కోరు సాధించాడు. భారత బౌలర్లలో విక్కీ ఓస్ట్వాల్ మూడు వికెట్లు తీయగా.. కౌశల్ తాంబేకు రెండు వికెట్లు దక్కాయి. రాజ్ బవా, రవి కుమార్, రాజ్‌వర్థన్ హంగర్కేకర్‌లకు చెరో వికెట్ దక్కింది.
102 పరుగుల సులభ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆడుతూ, పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ హర్నూర్ సింగ్ (5: 13 బంతుల్లో) త్వరగా అవుటైనప్పటికీ.. మరో ఓపెనర్ ఆంగ్రిక్ష్ రఘువంశీ (56: 67 బంతుల్లో, ఏడు ఫోర్లు), షేక్ రషీద్ (31: 49 బంతుల్లో, రెండు ఫోర్లు) మరో వికెట్ పడకుండానే మ్యాచ్‌ను ముగించారు. శ్రీలంక బౌలర్లలో యసిరు రోడ్రిగోకు ఒక వికెట్ దక్కింది.