టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ ఈ రోజు మెరిసింది. రెండు రోజుల విరామం తర్వాత ఈ రోజు భారత్ 3 పతకాలను ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు మొత్తం 13 పతకాలు సొంతమయ్యాయి.   






పురుషుల ఆర్చరీ వ్యక్తిగత రికర్వ్‌ పోటీల్లో హర్విందర్‌ సింగ్‌ కాంస్య పతకం సాధించాడు. దీంతో పారాలింపిక్స్‌ ఆర్చరీ విభాగంలో భారత్‌కు తొలి పతకం అందించిన అథ్లెట్‌గా హర్విందర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కొరియాకు చెందిన పారా అథ్లెట్‌ కిమ్‌ మిను సూతో జరిగిన కాంస్య పతక పోరులో హర్విందర్ 6-5 (26-24, 27-29, 28-25, 25-25, 26-27) తేడాతో గెలిచి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. హర్విందర్‌ సింగ్‌ సాధించిన పతకంతో పారాలింపిక్స్‌లో భారత్‌ పతకాల సంఖ్య 13కు చేరుకుంది. అంతకుముందు సెమీఫైనల్స్‌లో అమెరికా అథ్లెట్‌ కెవిన్‌ మాదర్‌ చేతిలో 6-4 (25-28, 24-24, 25-25, 25-24, 24-26) తేడాతో ఓటమిపాలయ్యాడు. 






ఇప్పటి వరకు భారత్ 2 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్య పతకాలతో మొత్తం 13 పతకాలతో సాధించిన ఇండియా... పతకాల పట్టికలో 37వ స్థానంలో నిలిచింది. అంతకుముందు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్స్‌లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన అవనీ లేఖరా 50 మీటర్ల రైఫిల్ 3పీ ఎస్‌హెచ్ 1 ఫైనల్‌లో కాంస్యం సాధించింది. ఒకే పారాలింపిక్స్ టోర్నీలో రెండు పతకాలు సాధించిన మొట్టమొదటి భారత అథ్లెట్‌గా అవనీ లేఖరా చరిత్ర సృష్టించింది. ప్రవీణ్‌ కుమార్‌ హైజంప్‌లో రజతం సాధించాడు.