స్వర్ణ పతకమే లక్ష్యంగా టోక్యో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన పీవీ సింధు సెమీఫైనల్లో ఓడిపోయింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు...18-21, 21-12 తేడాతో పరాజయం పాలైంది. దీంతో స్వర్ణ పతకం గెలవాలన్న సింధు కల కలగానే మిగిలిపోయింది. తొలి సెట్ మొదట్లో పూర్తి ఆధిక్యంతో ఉన్న సింధు 11-8తో బ్రేక్ తీసుకుంది. దీంతో తొలి సెట్ సింధు సొంతం అనుకున్నారు. కానీ, విరామం నుంచి వచ్చిన తై జు తెలివిగా ప్రత్యర్థిపై విరుచుకుపడింది. దీంతో స్కోరును సమం చేసింది. ఈ క్రమంలో ఇద్దరు నువ్వా నేనా అన్నట్లు హోరాహోరీగా తలపడ్డారు.
కానీ, చివరకు 21-18తో సింధు తొలి సెట్‌ను చేజార్చుకుంది. రెండో సెట్‌లో కూడా సింధుకు తైజు యింగ్ ఏమాత్రం కోలుకునే అవకాశం ఇవ్వలేదు. వీలు చిక్కినప్పుడల్లా సింధు పాయింట్లు సాధిస్తూ వచ్చింది కానీ ప్రత్యర్థి మాత్రం లీడ్‌లో కొనసాగుతూనే ఉంది. దీంతో ఒత్తిడికి గురైన సింధు అనవసర తప్పిదాలు చేస్తూ పాయింట్లు సమర్పించింది. దీంతో 21-12తో రెండో సెట్ కూడా ఓడిపోయింది. కాంస్యం కోసం సింధు... చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోతో ఆదివారం సాయంత్రం 5గంటలకు తలపడనుంది.
మరో సెమీఫైనల్లో చైనా క్రీడాకారిణులు బి హింగ్జియావో - చెన్ యు ఫెయ్ తలపడ్డారు. హోరాహొరీగా జరిగి ఈ మ్యాచ్లో చెన్ యు ఫెయ్ 21-16, 13-21, 21-12తేడాతో విజయం సాధించి ఫైనల్ చేరింది. సెమీఫైనల్లో ఓడిన ఇద్దరు కాంస్యం కోసం ఆదివారం తలపడనున్నారు. ఈ పోరులో ఎవరు గెలిస్తే వారికి కాంస్యం ఖాయం అవుతుంది. ఓడిన వారు నాలుగో స్థానంతో సరిపెట్టుకోవల్సిందే.
సింధు అనుకున్న ప్రదర్శన చేయలేదు
ఒలింపిక్స్ సెమీఫైనల్లో సింధు తన అసలైన ప్రదర్శన చేయలేదని ఆమె తండ్రి వెంకట రమణ అన్నారు. మ్యాచ్ అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సింధు అసలైన ప్రదర్శన చేయలేదని, మొదటి సెట్ గెలిచి ఉంటే మూడో సెట్ వరకు మ్యాచ్ వెళ్లి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తై జు యింగ్ చాలా స్ట్రాటజీగా ఆడిందని, ఆమె నంబర్ వన్ ప్లేయర్ అని, ఆమె తన వ్యూహాలు అమలు చేయడంలో విజయవంతం అయ్యిందని అన్నారు. మ్యాచ్ సమయంలో ఎవరు ఎలా ఆడతారనేది తెలియదని, బాగా ఆడిన వాళ్లు విజయం సాధిస్తారన్నారు. తొలి గేమ్ సింధు విజయం సాధించి ఉంటే తై జు ఒత్తిడికి గురై ఉండేదేమో. సింధు ఈ రోజు ఒత్తిడికి గురికాలేదని తన ఆట పట్ల సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. కాంస్యం కోసం జరిగే మ్యాచ్ కూడా అంత సులువుగా జరగదని తెలపారు.