అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సహా నలుగురు సీనియర్ పోలీసులు, మరో ఇద్దరు అధికారులపై మిజోరం పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇటీవల సరిహద్దులో జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యులను చేస్తూ ఈ కేసులు పెట్టినట్లు మిజోరం పోలీసులు తెలిపారు.
అసోం సీఎం, అధికారులపై హత్యాయత్నం సహా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం. ఇటీవల మిజోరం, అసోం పోలీసుల మధ్య జరిగిన కాల్పుల ఘటనపై వైరెంగ్ తే పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశాం.
మిజోరం ఐజీ
వీరిపై కేసులు..
అసోం ఐజీ అనురాగ్ అగర్వాల్, కాచర్ డీఐజీ దేవోజ్యోతి ముఖర్జీ, కాచర్ ఎస్పీ చంద్రకాంత్ సహా దోలై పోలీస్ స్టేషన్ లో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. వీరితో పాటు కాచర్ డిప్యూటీ కమిషనర్ కీర్తి జల్లీ, కాచర్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సన్నీదేవోపైనా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వీరితో పాటు 200 మంది గుర్తుతెలియని అసోం పోలీసులపై కేసులు పెట్టారు. అయితే నలుగురు పోలీసు అధికారులు, ఇద్దరు పాలనా అధికారులను ప్రశ్నించేందుకు సమన్లు జారీ చేశారు.
మిజోరం పోలీసుల వద్ద ఆయుధాలు: అసోం సీఎం
అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదంపై అసోం ముఖ్యమంత్రి హిమంత.. మిజోరం ప్రజలపై పలు విమర్శలు చేశారు. మిజోరం పౌరుల వద్ద ఆయుధాలు ఉన్నాయని.. కనుక పక్క రాష్ట్రానికి వెళ్లొదని అసోం ప్రజలకు హిమంత సూచించారు.