టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగింది తెలుగు తేజం పీవీ సింధు. రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు ఈ ఒలింపిక్స్‌లో స్వర్ణంగా మార్చుకోవాలని భారీ అంచనాల నడుమ అడుగుపెట్టింది. ఇప్పటి వరకు ఆ దిశగా అంచనాలకు తగ్గట్లుగానే సత్తాచాటుతోంది. శుక్రవారం హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ఆరో సీడ్‌ సింధు 21-13, 22-20తో స్థానిక క్రీడాకారిణి, పతకం ఫేవరెట్లలో ఒకరైన అకానె యమగూచిపై విజయం సాధించింది. 56 నిమిషాల పాటు నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ పోరులో ప్రత్యర్థి ఆటకట్టించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో రెండుసార్లు సెమీస్‌ చేరిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు సరికొత్త రికార్డు సృష్టించింది. 


శనివారం జరిగే సెమీస్‌లో సింధు... రెండో సీడ్‌ తైజు యింగ్‌ (చైనీస్‌ తైపీ)తో సింధు తలపడనుంది. గత ఏడాది రియో ఒలింపిక్స్ ఫైనల్‌లో సింధు x మారిన్ మ్యాచ్‌కి ఎంత క్రేజ్ ఉందో... సరిగ్గా అదే క్రేజ్ ఈ రోజు మ్యాచ్‌కి ఉండనుంది. ఎందుకంటే తై జు యింగ్... సింధు ఇద్దరూ దూకుడైన క్రీడాకారిణులు. వీరిద్దరి మధ్య పోరు ఎప్పుడూ నువ్వా నేనా అన్నట్లే సాగుతోంది. కానీ, ఎన్నోసార్లు సింధు... తైజు యింగ్ చేతిలో పోరాడి ఓడింది. టోక్యో ఒలింపిక్స్‌లో సింధు ఇప్పటి వరకు తనకంటే తక్కువ గెలుపోటముల రికార్డు ఉన్నవారితోనే ఆడింది. సెమీఫైనల్లో మాత్రం తన మీద మంచి గెలుపు రికార్డు ఉన్న తైజు యింగ్‌తో తలపడబోతోంది. ఇప్పటివరకు ఈ ఇద్దరూ 18 సార్లు తలపడగా 15 సార్లు తై జు యింగ్‌నే విజయం వరించింది. కేవలం 3సార్లు మాత్రమే సింధు గెలిచింది. దీంతో తై జు యింగ్ పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉంది. చివరిసారిగా వీరిద్దరూ తలపడిన మూడు మ్యాచ్‌ల్లోనూ తైజుదే విజయం. కానీ, టోక్యో ఒలింపిక్స్ లాంటి ప్రతిష్టాత్మక క్రీడల్లో సెమీఫైనల్ అంటే ఎవరికైనా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఈ రోజు మ్యాచ్‌లో ఎవరు ఒత్తిడిని అధిగమించి మ్యాచ్‌లో విజయం సాధిస్తారో చూడాలి.   


మరో సెమీస్‌లో చైనీస్‌ క్రీడాకారిణులు చెన్‌ యుఫెయ్‌, హి బింగ్జియావో పోటీపడనున్నారు. సింధు సెమీస్‌ అడ్డంకిని అధిగమిస్తే బంగారు పతకం ఖాయమేనన్నది విశ్లేషకుల అంచనా. యమగూచిపై 13-7తో మెరుగైన గెలుపోటముల రికార్డున్న సింధుకు క్వార్టర్స్‌లో గట్టి పోటీ తప్పకపోవచ్చని అందరూ అనుకున్నారు. అయితే ప్రిక్వార్టర్స్‌లో అద్వితీయమైన ఆటతీరుతో ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపిన సింధు.. శుక్రవారం నాటి మ్యాచ్‌లోనూ ఏమాత్రం తగ్గలేదు. ప్రిక్వార్టర్స్‌లో ప్రదర్శించిన ఆటకు మించిన నైపుణ్యం, ఫిట్‌నెస్‌తో యమగూచికి అందనంత ఎత్తులో కనిపించింది. కోర్టులో ఏ మూలలోకి షటిల్‌ వచ్చినా సింధు అలవోకగా అందుకుంది. అదే సమయంలో ప్రత్యర్థికి అందనంత దూరంలో క్రాస్‌ కోర్ట్‌ స్ట్రోక్‌లతో అదరగొట్టింది. స్టేడియంలో గాలివాటాన్ని పూర్తిగా చదివేసిన భారత అమ్మాయి షటిల్‌పై నియంత్రణతో ఆడింది. స్ట్రోక్‌లలో కచ్చితత్వంతో యమగూచిని చిత్తుచేసింది.