టోక్యో ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ రవి కుమార్ దహియా రజత పతకం సాధించాడు. 57 కిలోల విభాగంలో స్వర్ణ కోసం జరిగిన పోరులో అతడు రష్యాకు చెందిన యుగేవ్‌ జావుర్‌ చేతిలో 7-4 తేడాతో ఓడాడు. దీంతో రజత పతకం దక్కింది. భారత్ తరఫున రెజ్లింగ్ విభాగంలో రజత పతకం సాధించిన రెండో ఆటగాడి రవికుమార్ దహియా. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన యుగేవ్‌తో పోరు అంత సులువు కాదని రవికి తెలుసు. కానీ,  చివరి నిమిషం వరకు స్వర్ణం కోసం ఎంతో శ్రమించాడు. రజత పతకం సాధించిన రవికి ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 


సుశీల్ తర్వాత రవినే
బుధవారం హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో ప్రత్యర్థి నురిస్లామ్‌ సనయేవ్‌ (కజకిస్థాన్‌)ను పిన్‌ డౌన్‌ (ఫాల్‌) చేసి ఫైనల్‌కి దూసుకెళ్లాడు. ప్రత్యర్థి రెండు భుజాలను మ్యాట్‌కు నొక్కి పెడితే ఫాల్‌ ద్వారా విజయం సాధించినట్లు. హరియాణాకు చెందిన దహియా ఈ విజయంతో.. సుశీల్‌ కుమార్‌ (2012) తర్వాత రెజ్లింగ్‌లో స్వర్ణ పతక బౌట్‌కు అర్హత సంపాదించిన రెండో భారతీయుడిగా నిలిచాడు. రవి ఫైనల్‌ చేరే క్రమంలో తొలి రౌండ్లో 13-2తో టిగ్రెరోస్‌ అర్బానో (కొలంబియా)ను, క్వార్టర్స్‌లో 14-4తో వాలెంటినోవ్‌ వంగెలోవ్‌ (బల్గేరియా)ను చిత్తు చేశాడు. 


రవి దహియా-సనయేవ్‌ (కజకిస్థాన్‌) మధ్య క్వార్టర్‌ఫైనల్‌లో అనూహ్య సంఘటన జరిగింది. ఆఖరి సెకన్లలో ప్రత్యర్థిని పడేసే ప్రయత్నం చేస్తుండగా... అతడు ఎలాగైనా తప్పించుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో అతడు రవి చేతి కండను కొరికాడు. నొప్పిని పంటి కింద భరించాడు కానీ పట్టు వదల్లేదు. 


రవి నేపథ్యం
హరియాణా అంటేనే మనకు రెజ్లర్లు జ్ఞాపకమొస్తారు. ఆ రాష్ట్రంలోని నాహ్రి రవి సొంతూరు. రవి తండ్రి రాకేశ్‌ దహియా రైతు. వీరికి సొంత పొలం కూడా లేదు. ఇతరుల పొలాలను కౌలుకు తీసుకుని సాగు చేస్తుంటాడు రాకేశ్. రెజ్లింగ్‌పై రవికి ఉన్న ఇష్టాన్ని ఆయన ఎప్పుడూ కాదనలేదు. అతడిని మరింత ప్రోత్సహించాడు. తమ గ్రామానికి చెందిన అమిత్‌ దహియా ప్రపంచ రెజ్లింగ్‌లో పతకం గెలవడంతో తన కొడుకునూ అలా చూడాలనుకున్నాడు రాకేశ్. అప్పులు చేసి మరీ రవిని ప్రోత్సహించాడు. 10 ఏళ్ల వయసులో దిల్లీలో చత్రసాల్‌ స్టేడియంలో చేర్పించాడు.


ఆట తప్ప రవికి మరో ధ్యాస ఉండేది కాదు. అతనిలోని ప్రతిభను గుర్తించిన స్టేడియంలో ట్రైనింగ్‌ హాల్‌కు పక్కన ఉండే గదిని అతడికి కేటాయించారు. ఆ గదికి ఓ ప్రత్యేకత ఉంది. ఒలింపిక్స్‌ పతకం గెలిచిన యోగేశ్వర్‌ దత్‌ ఒకప్పుడు ఆ గదిలోనే ఉన్నాడు. దీంతో ఛాంపియన్ అవ్వాలన్న రవి కసి మరింత పెరిగింది. రవి తండ్రి రాకేశ్ ప్రతి రోజు 60 కిలోమీటర్లు ప్రయాణించి పాలు, పండ్లు అందించేవాడు. పేదరికాన్ని అతడు తన కెరీర్‌కి అడ్డుగా రవి ఎప్పుడూ భావించలేదు.