బుధవారం(28-07-2021) టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఈ కింది క్రీడాంశాల్లో పాల్గొననుంది. తెలుగు తేజం పీవీ సింధు రెండో రౌండ్లో హాంకాంగ్ క్రీడాకారిణితో తలపడనుంది. సాయి ప్రణీత్ నామమాత్రపు మ్యాచ్లో తలపడుతున్నాడు. ఇప్పటికే అతడు క్వార్టర్స్‌కి అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. పతకం ఖాయమనుకున్న ఆర్చరీ క్రీడాకారిణి దీపక కుమారి ఇప్పటి వరకు మిక్స్‌డ్ డబుల్స్, డబుల్స్‌లో ఫైనల్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది. మరి రేపు వ్యక్తిగత విభాగంలో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. బాక్సింగ్‌లో పూజా రాణి రాణించాలి.
* హాకీ: మహిళల గ్రూప్-ఎ మ్యాచ్ (భారత్ × గ్రేట్ బ్రిటన్) ఉ.6.30 నుంచి.
* బ్యాడ్మింటన్: మహిళల సింగిల్స్ గ్రూప్ - జె (పీవీ సింధు × చెంగ్) ఉ.7.30 నుంచి.
* ఆర్చరీ: పురుషుల వ్యక్తిగతం(తరుణ్ దీప్ రాయ్) ఉ.7.31నుంచి.
* రోయింగ్ : పురుషుల డబుల్ స్కల్స్ సెమీఫైనల్(అర్జున్ లాల్, అరవింద్ సింగ్) ఉ.8.00నుంచి.
* సెయిలింగ్ : పురుషుల స్కిఫ్ (గణపతి, వరుణ్) ఉ. 8.35నుంచి
* ఆర్చరీ: పురుషుల సింగిల్స్ (ప్రవీణ్ జాదవ్) మ.12.30నుంచి
* ఆర్చరీ: మహిళల సింగిల్స్ (దీపిక కుమారి) మ.2.14నుంచి
* బ్యాడ్మింటన్: పురుషుల సింగిల్స్ గ్రూప్-డి (సాయి ప్రణీత్)
* బాక్సింగ్: పూజా రాణి మ.2.33నుంచి.
ఇప్పటి వరకు భారత్ కేవలం ఒకే ఒక్క పతకం గెలిచింది. మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకం గెలిచింది. మిగతా క్రీడాంశాల్లో గత నాలుగు రోజులుగా భారత్ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేయలేకపోతున్నారు. పతకాలు గెలుస్తారనుకున్న ఆటగాళ్లు సైతం తమ విభాగాల్లో ఘోరంగా విఫలమవుతున్నారు. ఫైనల్‌కు అర్హత సాధించడంలోనూ మన వాళ్లు చేతులెత్తేస్తున్నారు. తీవ్రమైన ఒత్తిడికి లోనైన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనిక బాత్ర 3వ రౌండ్లో పరాజయం పాలైంది. మరోపక్క పురుషుల సింగిల్స్ టేబుల్ టెన్నిస్ లోనూ శరత్ కమల్ 3వ రౌండ్ నుంచే వెనుదిరిగాడు. ఈ రోజు జరిగిన సంచలనం ఏదన్నా ఉందంటే... బాక్సింగ్‌లో లవ్లీనా విజయం సాధించడమే. జర్మనీ క్రీడాకారిణిపై విజయం సాధించి తదుపరి రౌండ్ కి అర్హత సాధించింది. ఈ నెల 30న చైనీస్ తైపీ క్రీడాకారిణితో మ్యాచ్లో లవ్లీనా విజయం సాధిస్తే కనీసం కాంస్య పతకమైనా ఖాయమౌతుంది. మరి రేపటి క్రీడాంశాల్లో మన క్రీడాకారులు ఎంతవరకు పతకాలకు దగ్గరవుతారో చూద్దాం.
మరోపక్క పీవీ సింధు కూడా ఒత్తిడికి గురవుతోంది. కచ్ఛితంగా పతకం గెలుస్తోందన్న అంచనాలకు సింధు ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో రియో ఒలింపిక్స్ ఫైనల్లో చేసిన తప్పును సింధు చేయకుండా ఉంటే ఆమె తప్పకుండా విజయం సాధిస్తుంది.