పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ పనుల్లో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు విరామం ఇచ్చిన పవన్ కళ్యాణ్ తాజాగా సెట్‌ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ విషయాన్ని చిత్రబృందం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఖాకీ చొక్కా ధరించి సెట్‌ లోకి పవన్ కళ్యాణ్ అడుగుపెట్టిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్.. భీమ్లా నాయక్ అనే పాత్రలో కనిపించనున్నారు. ఇన్ని రోజులు క్యారెక్టర్ పేరును దాచి పెట్టిన చిత్రయూనిట్ తాజాగా ఈ సీక్రెట్ రివీల్ చేసింది. ఈ క్రమంలో చిత్రయూనిట్ వదిలిన స్టిల్ ఓ రేంజ్‌లో వైరల్ అయింది.

 

తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ కుర్తా వేసుకొని సెట్ లోకి ఎంట్రీ ఇస్తోన్న సీన్ తో వీడియో మొదలైంది. ఆ తరువాత కారులో నుండి రానా దిగడం.. పవన్ కళ్యాణ్ నడుం మీద చేయి వేసుకొని పోలీస్ గెటప్ లో కనిపించే సన్నివేశాలను చూపించారు. మెల్లగా పవన్ కాస్ట్యూమ్ ని చూపిస్తూ 'భీమ్లా నాయక్' అనే పేరుని పోలీస్ యూనిఫామ్ పై కనిపించేలా విజువల్స్ కట్ చేశారు. పవన్ కళ్యాణ్ అలా నడిచొస్తున్న సీన్ ను చూపిస్తూ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆ సీన్ ను మరింత ఎలివేట్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోందని.. సంక్రాంతి 2022కి సినిమా విడుదలవుతుందని ఈ మేకింగ్ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో ట్విట్టర్ టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. 
 



 

మలయాళ వెర్షన్ లో బిజు మీనన్, పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోలుగా నటించారు. తెలుగులో పృథ్వీ పాత్రను రానా పోషిస్తుండగా.. బిజు మీనన్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. పవన్ కు జోడీగా నిత్యామీనన్ కనిపించనుంది. రానా భార్య పాత్రలో కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాజేష్ ను ఎంపిక చేసుకున్నారు. సినిమాలో మరో ముఖ్య పాత్రలో బ్రహ్మాజీ, క్యామియో రోల్ లో దర్శకుడు వి.వి.వినాయక్ కనిపించనున్నారు. 

 

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాను సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తుండగా.. త్రివిక్రమ్ మాటలు-స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకి రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.