భారత్-శ్రీలంక మధ్య ఈ రోజు రాత్రి జరగాల్సిన రెండో టీ20 వాయిదాపడింది. షెడ్యూల్ ప్రకారం మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా రాత్రి 8గంటలకు ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, మ్యాచ్‌కి ముందు భారత ఆటగాళ్లకు కరోనా టెస్టులు నిర్వహించారు. ఇందులో కృనాల్ పాండ్య పాజిటివ్‌గా తేలాడు. దీంతో మ్యాచ్‌ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా దృవీకరించింది.
వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది జట్టు మేనేజ్‌మెంట్‌కి సమాచారం అందించింది. దీంతో బీసీసీఐ... లంక బోర్డుతో మాట్లాడి ఇరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ని పోస్ట్ పోన్ చేశారు. షెడ్యూల్ ప్రకారం అయితే ఇరు జట్ల మధ్య ఈ రోజు రెండో టీ20, గురువారం చివరిదైన మూడో T20 జరగాల్సి ఉంది. బీసీసీఐ సవరించిన షెడ్యూల్ ప్రకారం ఇరు జట్లు రేపు, ఎల్లుండి వరుసగా రెండు టీ20లు ఆడనున్నాయి. ఈ మేరకు బీసీసీఐ ట్వీట్ చేసింది.
ఈ రోజు ఉదయం భారత క్రీడాకారులందరికీ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు నిర్వహించారు. ఈ టెస్టుల్లో కృనాల్ పాండ్యకు పాజిటివ్ వచ్చింది. దీంతో కృనాల్‌తో సన్నిహితంగా మెలిగిన ఎనిమిది మంది ఆటగాళ్లను గుర్తించి వారిని ఐసోలేషన్‌కి పంపారు. ముందు జాగ్రత్తగా ఆటగాళ్లకు ఈ రోజు RT-PCR టెస్టు నిర్వహించనున్నట్లు బీసీసీఐ పేర్కొంది.
తొలి పోరులో శ్రీలంకను చిత్తుచేసిన గబ్బర్ సేన రెండో మ్యాచ్‌లో నెగ్గి టీ20 సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైన పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌లకు విశ్రాంతినివ్వాలని జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయిస్తే తప్ప రెండో మ్యాచ్‌లో భారత జట్టులో మార్పులు చేయకపోవచ్చు. అయితే ఈ ఇద్దరు మంగళవారం మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారని, ఈ పోరుతోనే సిరీస్ సొంతమైతే మూడో మ్యాచ్‌కు పృథ్వీ, సూర్యలకు విశ్రాంతినివ్వడం ఖాయమనుకున్నారు. జట్టు మేనేజ్‌మెంట్ మదిలో రెండో ఆలోచన ఉంటే ఈ మ్యాచ్‌లో దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్‌లకు అవకాశం రావొచ్చు.
ఇప్పుడు కృనాల్ పాండ్య స్థానంలో జట్టులోకి ఎవరు వస్తారో చూడాలి. కృనాల్‌తో సన్నిహితంగా మెలిగిన 8మంది ఐసోలేషన్‌కి వెళ్లారు. వారు ఎవరు అన్న దానిపై స్పష్టత లేదు. ఒకవేళ ఐసోలేషన్‌లో ఉన్నవారు ఎవరైనా పాజిటివ్‌గా తేలితే టీమిండియా ఏం చేస్తుందో చూడాలి.
రెండో టీ20కి భారత్ తుది జట్టు (అంచనా): శిఖర్ ధావన్ (కెప్టెన్), పృథ్వీ షా/ రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్/రుతరాజ్ గైక్వాడ్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, యుజ్వేందర్ చాహల్, వరుణ్ చక్రవర్తి, పడిక్కల్.