అంతర్జాతీయ క్రికెట్‌లో హ్యాట్రిక్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. ఒక బౌలర్ మూడు వరుస బంతుల్లో.. మూడు వికెట్లు తీయడమే హ్యాట్రిక్. సెంచరీలు, అర్థ సెంచరీలు చేయడం కంటే హ్యాట్రిక్ తీయడమే చాలా కష్టం. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు మొత్తంగా 21 హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి. వీటిలో 2007 నుంచి 2020 వరకు 14 సంవత్సరాల్లో కేవలం 13 హ్యాట్రిక్‌లు మాత్రమే నమోదు కాగా.. గత ఎనిమిది నెలల కాలంలోనే 8 హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి.


ఇక అంతర్జాతీయ టీ20ల్లో మొదటి హ్యాట్రిక్ 2007 టీ20 వరల్డ్‌కప్‌లోనే నమోదైంది. ఆస్ట్రేలియాకు చెందిన అప్పటి సూపర్ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ.. బంగ్లాదేశ్‌పై ఈ హ్యాట్రిక్ నమోదు చేశాడు. 2007 సెప్టెంబర్ 16వ తేదీన జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.


ఆ తర్వాత రెండో హ్యాట్రిక్‌కు మళ్లీ రెండేళ్లు పట్టింది. 2009లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు చెందిన జాకబ్ ఓరమ్ ఈ ఫీట్ సాధించాడు. 2010లో మూడో హ్యాట్రిక్ అనంతరం నాలుగో హ్యాట్రిక్ రావడానికి ఏకంగా ఆరేళ్లు పట్టింది. 2010లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టిమ్ సౌతీ హ్యాట్రిక్ సాధించాడు. ఆ తర్వాత ఆరేళ్లకు 2016లో శ్రీలంకకు చెందిన తిషార పెరీరా నాలుగో హ్యాట్రిక్ తీయగలిగాడు. ఈ హ్యాట్రిక్ భారత్ మీదనే వచ్చింది. అయినప్పటికీ ఆ మ్యాచ్‌లో భారతే విజయం సాధించింది.


ఇక అంతర్జాతీయ టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన ఏకైక భారత బౌలర్ దీపక్ చాహరే. 2019లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపక్ చాహర్ ఈ ఫీట్ సాధించాడు. ఆ మ్యాచ్‌లో దీపక్ చాహర్ ఏడు పరుగులిచ్చి ఆరు వికెట్లు తీయడం విశేషం. అంతర్జాతీయ టీ20ల్లో ఉత్తమ వ్యక్తిగత బౌలింగ్ గణాంకాలు ఇవే.


ఈ పొట్టి ఫార్మాట్‌లో రెండు హ్యాట్రిక్‌లు తీసిన ఏకైక బౌలర్ లసిత్ మలింగనే. 2017లో బంగ్లాదేశ్‌పై, 2019లో న్యూజిలాండ్‌పై మలింగ హ్యాట్రిక్‌లు సాధించాడు. మలింగ కాకుండా బ్రెట్ లీ(ఆస్ట్రేలియా), జాకబ్ ఓరమ్ (న్యూజిలాండ్), టిమ్ సౌతీ(న్యూజిలాండ్), తిషారా పెరీరా (శ్రీలంక), ఫహీం అష్రాఫ్ (పాకిస్తాన్), రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్తాన్), మహ్మద్ నస్‌నెయిన్ (పాకిస్తాన్), ఖావర్ అలీ (ఒమన్), నార్మన్ వనువా (పపువా న్యూ గినియా), దీపక్ చాహర్ (భారత్), ఆస్టన్ అగర్ (ఆస్ట్రేలియా), అకిలా ధనంజయ (శ్రీలంక), వసీం అబ్బాస్ (మాల్టా), షెహరాజ్ షేక్ (బెల్జియం), నాథన్ ఎల్లిస్ (ఆస్ట్రేలియా), ఎలీజా ఒటియెనో (కెన్యా), కోఫీ బగబేనా (ఘనా), కర్టిస్ క్యాంప్‌ఫర్ (ఐర్లాండ్), డైలాన్ బ్లిగ్నాట్ (జర్మనీ)లు అంతర్జాతీయ టీ20 క్రికెట్లో హ్యాట్రిక్ తీసుకున్నారు.


రేపటి నుంచి టీ20 వరల్డ్‌కప్ పూర్తి స్థాయిలో ప్రారంభం కానుంది. కాబట్టి ఈ కప్‌లో కూడా ఏమైనా హ్యాట్రిక్‌లు నమోదు అవుతాయేమో చూడాలి. ఎందుకంటే ఈ సంవత్సరం ఇప్పటికే 8 అంతర్జాతీయ టీ20 హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి. యూఏఈలో జరిగిన ఐపీఎల్‌లో బెంగళూరుకు చెందిన బౌలర్ హర్షల్ పటేల్ కూడా హ్యాట్రిక్ సాధించాడు. బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లు కూడా యూఏఈలో ఉన్నాయి కాబట్టి అన్నీ కలిసొస్తే ప్రధాన మ్యాచ్‌ల్లో కూడా మనం హ్యాట్రిక్ గణాంకాలు చూడవచ్చు.


Also Read: పాక్‌కు చుక్కలు చూపించే భారత ఆటగాడు అతడే.. మాథ్యూ హెడేన్‌ అంచనా


Also Read: ఈ క్రికెటర్లు రిచ్చో రిచ్చు! టీ20 ప్రపంచకప్‌ ఆడేస్తున్న కోటీశ్వరులు వీరే!


Also Read: ఐపీఎల్‌ క్రేజ్‌కు ఫిదా! కొత్త ఫ్రాంచైజీపై 'మాంచెస్టర్‌ యునైటెడ్‌' ఆసక్తి!


Also Read: పాక్‌వి గంభీరమైన ప్రేలాపనలే! దాయాదిపై భారత జైత్రయాత్రకు కారణాలు చెప్పిన వీరూ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి