దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది! బాక్సింగ్‌ డే మధ్యాహ్నం 1:30 గంటలకు సెంచూరియన్‌ వేదికగా ఆతిథ్య జట్టుతో తలపడుతోంది. ఈ మ్యాచులో ఏ బ్యాటర్‌ ఎక్కువ సేపు ఆడతాడోనని అంతా ఎదురు చూస్తున్నారు.


ఎందుకంటే స్పాంజీ బౌన్స్‌, పేస్‌ ఉండే ఇక్కడి పిచ్‌లపై ఓపికగా ఆడితేనే పరుగులు చేయగలరు. 1997లో టీమ్‌ఇండియా వాల్‌ రాహుల్‌ ద్రవిడ్‌ దీనిని నిరూపించాడు. సఫారీ గడ్డపై ఎక్కువ సమయం, ఎక్కువ బంతులు ఆడిన ఏకైక భారతీయుడిగా నిలిచాడు. మరి ఈ సారి ఎవరైనా ఆ రికార్డును బద్దలు చేయగలరా?


1997, జనవరి 16న జోహానెస్‌ బర్గ్ వేదికగా సఫారీ జట్టుతో టీమ్‌ఇండియా తలపడింది. ఈ మ్యాచు నువ్వానేనా అన్నట్టుగా సాగింది. భారత్‌ గెలవాల్సిన ఈ మ్యాచును సఫారీ ఆటగాళ్లు డ్రాగా మలిచారు. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 410 పరుగులు చేసింది. ఓపెనర్లిద్దరూ త్వరగా ఔటైన వేళ రాహుల్‌ ద్రవిడ్‌ (148; 362 బంతుల్లో 21x4) గోడలా నిలిచాడు. ఏకంగా 541 నిమిషాలు నిలబడి 362 బంతులు ఆడాడు. 


బదులుగా దక్షిణాఫ్రికా 321 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ ద్రవిడే (81) టాప్‌ స్కోరర్‌. ఇందుకోసం 208 నిమిషాలు క్రీజులో నిలిచి 146 బంతులు ఎదుర్కొన్నాడు. 266/8 వద్ద సచిన్‌ సేన డిక్లేర్‌ చేయగా డరైల్‌ కలినన్‌ (122) అజేయంగా నిలవడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.






ద్రవిడ్‌ తర్వాత దక్షిణాఫ్రికాలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక బంతులు ఎదుర్కొన్నది సచిన్‌ తెందూల్కర్‌. 2011లో 314 బంతులు ఎదుర్కొని 146 పరుగులు చేశాడు. ఇక 1992లో ప్రవీణ్ ఆమ్రె 299 బంతుల్లో 103 పరుగులు చేశాడు. 2001లో దీప్‌దాస్‌ గుప్తా 281 బంతులాడి 63 పరుగులు చేశాడు. మరి ఈ సారి ఎవరైనా ఈ రికార్డులను బద్దలు కొడతారేమో చూడాలి మరి!!