అసమ్మతి కార్యకలాపాలపై అధినేత సమీక్ష అంటే పార్టీని ప్రక్షాళన చేస్తాడని అనుకొన్నారు అంతా.. కానీ అధినేత ఏమాత్రం మారలేదు.. ముందు మాదిరిగానే ఉత్తుత్త బెదిరింపులు.. సర్దడాలతోనే సరిపోయింది అధినేత సమీక్ష అంటూ ఊసూరుమంటున్నారు మడకశిర తెలుగుతమ్ముళ్ళు. మడకశిరలో టీడీపీ బలంగా వుంది. ఎంతలా అంటే మొన్న జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రధాన నేతలు ఎవ్వరూ సహకరించకున్నా ఒక జడ్పీటీసీ గెలుచుకొన్నారంటే ఇక నేతలంతా కలిసికట్టుగా పనిచేసుంటే ఫలితాలు ఏవిదంగా వుండేవో వూహించుకోవచ్చు. కానీ. నేతల అసమ్మతి.. పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత కూడా ఏమాత్రం తగ్గకపోగా.. మరింత అధికమయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ ఏవిధంగా తన పార్టీలోని నేతలను కంట్రోల్ చేస్తున్నాడో ఆవిధంగా తమ నేత ఎందుకు గట్టిగా వ్యవహరించలేకపోతున్నాడంటూ మండిపడుతున్నారు తెలుగు తమ్ముళ్ళు. గత రెండురోజుల క్రితం మడకశిర సమీక్షా సమావేశం అమరావతిలో జరిగింది. ఈ సమీక్షా సమావేశంపైనే అందరూ అగ్రహంగా వున్నారు.. వివరాల్లోకి వెలితే..
మడకశిరలో పార్టీ కార్యక్రమాలన్ని చూసేది.. దగ్గరుండి నడిపించేది.. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి. అయితే, అది షెడ్యూల్డ్ నియోజకవర్గం కావడంతో గత ఎన్నికల్లో ముందు నుంచి పార్టీలో వున్న ఈరన్నను ఎమ్మెల్యేను చేశారు. అధికారంలో ఉన్నన్నాళ్ళు ఈరన్నను డమ్మీని చేసి గుండుమల తిప్పేస్వామి చక్రం తిప్పాడన్నది ఈరన్న వర్గీయుల వాదన. అదేమీ కాదు గుండమల లేకపోతే నియోజకవర్గంలో పట్టు ఎక్కడన్నది తిప్పేస్వామి వర్గీయుల భావన. అయితే గుండమల గత 2014 ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చాడని, కానీ అంతకుముందు నుంచి కూడా పార్టీ బలంగా వుందన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు ఈరన్న వర్గీయులు. ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీలోకి గుండుమల తిప్పేస్వామి వెళ్లేందుకు సిద్ధం అవుతాడని, ప్రస్తుతం కూడా పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నడంటూ ఈరన్న వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ ఇద్దరి నేతల మధ్య పార్టీ నలిగిపోతుంది.
కార్యకర్తలు ఎవరి దగ్గరకు వెళ్లాలో తెలియక ఇబ్బందిపడుతున్నారు. దీంతో ఈ విషయాన్ని తేలుద్దామని అధినేత అమరావతిలో మడకశిర నియోజకవర్గ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఇరువర్గాలు కూడా పెద్ద ఎత్తున తమ అనుచరులతో అమరావతి చేరుకొన్నారు. వీరందరిని చూసిన చంద్రబాబు బలప్రదర్శనకు వచ్చారా అంటూ నేతలపై మండిపడ్డారు. ఇద్దరు సర్దుకొని పనిచేయాలని సూచించాకు. బలమైన మడకశిరలో ఏదో ఒకటి తేల్చకుండా.. మళ్ళీ పాత పద్ధతిలోనే చెప్పడంతో కార్యకర్తలకు చిర్రెత్తుకొచ్చినట్లు తెలుస్తోంది. గట్టిగా నిర్ణయం తీసుకొని.. ఇంచార్జ్ విషయంలో క్లారిటీ ఇచ్చి పనిచేయమని చెప్తే పార్టీ బలంగా ముందుకు వెళ్తుంది.
ఎవరిని తప్పించినా రెండేళ్లు ఎన్నికలకు సమయం ఉంది కనుక అన్ని సర్దుకొని సన్నద్దం అయ్యే అవకాశాలు వున్నాయి. కానీ అధినేత మాత్రం ఎప్పట్లానే సర్దే ప్రయత్నం చేయడంతో కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇప్పటికైనా మారారు అనుకొంటే ఏ మాత్రం అధినేత మారలేదంటూ ఊసురుమంటున్నారు మడకశిర తెలుగు తమ్ముళ్ళు. అవతల పార్టీ మాత్రం ఏ నిర్ణయం అయినా ఆలోచించకుండా తీసుకొంటూ అందరిని ఆశ్చర్యపరుస్తూ వుంటారు. తమ నేతలు ఎందుకు ఇంతలా బయపడుతారో అన్నది అర్థం కావడం లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు.
Also Read: Omicrona Updates: తెలంగాణలో మరో 3 ఒమిక్రాన్ కేసులు....ఏపీలో కొత్తగా 104 కరోనా కేసులు, టీఎస్ లో 140