Flashback 2024: ఈ ఏడాది హకీలో భారత్ కు మిశ్రమ ఫలితాలే ఎదురైనా, ఎక్కువగా ప్రతిష్టాత్మక ఫలితాలే సాధించింది. పురుషుల జట్టు, ఒలింపిక్ మెడల్ సాధించగా, మహిళల జట్టు ఆసియా లెవల్లో చాంపియన్ గా నిలచింది. మొత్తానికి 2024 భారత హాకీకి మరియు భారత పురుషుల హాకీ జట్టుకు ఒక చిరస్మరణీయ సంవత్సరంగా మారింది. హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని పురుషుల జట్టు ఈ సంవత్సరంలో కొంత ఆకర్షణీయమైన హాకీని ఆడింది. FIH పురుషుల ర్యాంకింగ్స్‌లో ఐదవ స్థానంలో నిలిచింది. 
హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని జట్టు చాలా ఆశలతో పారిస్ ఒలింపిక్స్‌లోకి ప్రవేశించింది. అద్భుతమైన విజయాలతో ప్రయాణాన్ని ఆస్వాదించింది. పూల్-బిలో డిఫెండింగ్ ఛాంపియన్లు బెల్జియం, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మరియు ఐర్లాండ్‌లతో కలిసి భారత్ బరిలోకి దిగింది.. అర్జెంటీనాకు తో జరిగిన మ్యాచ్ లో (1-1) డ్రాగా ముగించినా, భారత్ 3-2తో న్యూజిలాండ్ ను ఓడించింది. అదే జోరులో తమ మూడవ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఓడించారు, అయితే ఆ తర్వాత బెల్జియం చేతిలో 1-2తో తేడాతో పరాజయాన్ని చవిచూశారు. 


క్వార్టర్స్ లో బ్రిటన్ పై గెలుపు..
చివరి లీగ్ మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ మెన్ ఇన్ బ్లూ లో ఉత్సాహాన్ని తగ్గించలేదు. ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్ ఫైనల్స్ పెనాల్టీ షూటౌట్‌లో భారత్ 4-2తో గ్రేట్ బ్రిటన్‌ను ఓడించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. రెండో సెమీఫైనల్లో జర్మనీతో ధైర్యంగా పోరాడారు. సెమీఫైనల్‌లో భారత్ తన స్టార్ డిఫెండర్ అమిత్ రోహిదాస్‌ సస్పెండ్ కు గురి కావడం దెబ్బ తీసింది. చివరకు జర్మనీ చేతిలో 3-2తో ఓడిపోయింది. సెమీస్‌లో ఓడిపోయినా తిరిగి బౌన్స్ బ్యాక్ అయినభారత్.. కాంస్య పతక పోరులో స్పెయిన్‌తో తలపడి 2-1తో విజయం సాధించింది. దీంతో వరుగా రెండోసారి ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని సాధించి, రికార్డులకెక్కింది. అలాగే చాంపియన్స్ ట్రోఫీని దక్కించుకుని సత్తా చాటింది. 


మహిళా జట్టు ముందంజ..
పారిస్ ఒలింపిక్స్‌ లో బెర్త దక్కక పోయిన తర్వాత, భారత మహిళల హాకీ జట్టు మార్పులకు లోనైంది. సిబ్బంది, కోచింగ్ స్టాఫ్ లో మార్పులు చేటు చేసుకున్నాయి.  అయితే నూతనొత్సహంతో బీహార్‌లోని రాజ్‌గిర్‌లో జరిగిన మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా తిరిగి పునరాగమనం చేసింది. ప్రధాన కోచ్ హరేంద్ర సింగ్ నేతృత్వంలో, భారత్ 1-0తో చైనాను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. చాలా ప్రతిష్టాత్మకమైన టోర్నీని గెలుచుకుని భారత జట్టు ముందంజ వేసింది. ఈ టోర్నీలో భారత్ అజేయంగా నిలవడం విశేషం. ఈక్రమంలో మలేషియాపై 4-0తో, దక్షిణ కొరియా పై 3-2తో, థాయిలాండ్ పై 13-0తో, చైనాపై 3-0తో జపాన్ పై 3-0తో లీగ్ దశలో విజయాలు సాధించింది. ఇక సెమీస్ లో మళ్లీ జపాన్ పై 2-0తో నెగ్గిన భారత్.. ఫైనల్లో 1-0తో చైనాను కంగుతినిపించి విజేతగా నిలిచింది. మరోవైపు ఎఫ్ఐహెచ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 5ఎస్ ప్రపంచకప్ లో భారత్ రన్నరప్ గా నిలిచింది. ఫైనల్లో నెదర్లాండ్స్ చేతిలో 2-7తో ఓడిపోయింది. మొత్తానికి అటు పురుషులు, ఇటు మహిళల హాకీలో ప్రతిష్టాత్మక విజయాలు నమోదయ్యాయి. వచ్చే ఏడాది కూడా ఇదే జోష్ లో జట్లు ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. 


Also Read: Smriti World Record: స్మృతి మంధాన రికార్డుల పరంపర - మరో రెండు ప్రపంచ రికార్డులతో జోరు, తొలి వన్డేలో విండీస్‌ను చిత్తు చేసిన భారత్