Ind Vs Wi Odi Series Latest Updates: భారత ఓపెనర్ స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్లో తన జోరుకొనసాగిస్తోంది. ఇప్పటికే ప్రపంచ రికార్డును నెలకొల్పడం తన అలవాటుగా మార్చుకున్న స్మృతి మంధాన.. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో మరో రెండు రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. ఆదివారం వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో స్మృతి మంధాన సూపర్ ఫిఫ్టీ (102 బంతుల్లో 91, 13 ఫోర్లు)ని నమోదు చేసింది. దీంతో వరుసగా ఐదు మ్యాచుల్లో ఐదు అర్థ శతకాలు నమోదు చేసిన తొలి ప్లేయర్‌గా నిలిచింది. అలాగే మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా బ్యాటర్‌గా రికార్డులకెక్కింది. గతంలో ఈ రికార్డు లార్ వోల్వర్ట్ (1593 రన్స్) పేరిట ఉండేది. తాజాగా దీన్ని మంధాన సవరించింది. ఇక మంధాన భారీ ఇన్నింగ్స్‌తో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 314 పరుగులు చేసింది. ఛేదనలో విండీస్ 26.2 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలి 211 పరుగులతో ఓడిపోయింది. పరుగుల పరంగా భారత్ కు ఇది రెండో అతి పెద్ద విజయం కావడం విశేషం.
భారీ భాగస్వామ్యం..
ఈ మ్యాచ్‌లో తొలుత కొత్త ఓపెనర్ ప్రతీకా రావల్ (69 బతుల్లో 40) తో కలిసి స్మృతి మంధాన తొలి వికెట్‌కు 110 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి, మంచి పునాది వేసింది. నిజానికి దుకూడైన బ్యాటర్ షెఫాలీ వర్మ స్థానంలో ఎందరినో ఓపెనర్‌గా ప్రయోగించినా వారెవరు ఆకట్టుకోలేదు. అయితే ప్రతీకా మాత్రం ఆ లోటు తీరుస్తూ మంధానకు సహకారం అందించి, యాంకర్ ఇన్నింగ్స్ ఆడింది. ఆ తర్వాత హర్లీన్ డియోల్ (44), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (34), రిచా ఘోష్ (26), జెమీమా రోడ్రిగ్స్ (31 ) సమయోచితంగా రాణించడంతో భారత్ 300 పరుగుల మార్కును దాటింది. బౌలర్లలో జైదా జేమ్స్ (5/45) ఆకట్టుకుంది. హేలీ మాథ్యూస్‌కు రెండు వికెట్లతో రాణించింది.
రేణుక ధాటికి విలవిల..
మీడియం పేసర్ రేణుకా సింగ్ (5/29) ధాటికి విండీస్ ఛేదనలో చతికిలపడింది. ఆరంభంలో వికెట్లు కోల్పోయిన ఆ జట్టు, ఏ దశలోనూ గెలిచే విధంగా కనిపించలేదు. ఆఫీ ఫ్లెచర్ (24 నాటౌట్) అజేయంగా నిలిచి కాస్త ఒంటరి పోరాటం చేసింది. షేమైన్ క్యాంబె (21) మాత్రమే కాస్త ఫర్వాలేదనిపించింది. మిగతా బౌలర్లలో ప్రియా మిశ్రాక రెండు వికెట్లు దక్కగా, దీప్తి శర్మ, టిటాస్ సాధుకు చెరో వికెట్ దక్కింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రేణుకకు దక్కింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో 1-0తో భారత్ ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే ఇదే వేదికపై మంగళవారం జరుగుతుంది.