Vaibhav Suryavanshi Latest Updates: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రికార్డుల పరంపర కొనసాగిస్తూనే ఉన్నాడు. తాజాగా మరొక ఘనత తన ఖాతాలో చేరింది. లిస్టు-ఏ క్రికెట్ ఆడిన భారత పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డులకెక్కాడు. విజయ్ హజారే వన్డే టోర్నీలో భాగంగా మధ్యప్రదేశ్ తోజరిగిన మ్యాచ్ లో వైభవ్ బరిలోకి దిగాడు. 13 ఏళ్ల 269 రోజుల సూర్యవంశీ తాజాగా ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు విదర్భకు చెందిన అలీ అక్బర్ పేరిట ఉండేది. తను 1999- 2000 మధ్య 14 ఏళ్ల వయసులో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. తాజాగా 25 ఏళ్ల రికార్డును వైభవ్ కొల్ల గొట్టినట్లు అయింది.
ఆకట్టుకోలేక పోయిన సూర్యవంశీ..
అయితే ఈ మ్యాచ్ లో వైభవ్ అంతగా ఆకట్టుకోలేక పోయాడు. కేవలం రెండు బంతులు మాత్రమే ఆడిన వైభవ్.. నాలుగు పరుగులతో వెనుదిరిగాడు. అంటే తొలి బంతికి బౌండరీ బాదిన ఈ చిచ్చర పిడుగు.. మలి బంతికే పెవిలియ్ కు చేరాడు. అయితే ఈ మ్యాచ్ లో బిహార్ ఆరు వికెట్లతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన బిహార్ 47 ఓవర్లలో 196 పరుగులు చేసింది. అయితే మధ్యప్రదేశ్ ఈ టార్గెట్ ను సునాయాసంగా అధిగమించింది. హరిష్ గావ్లీ (83), కెప్టెన్ రజత్ పాటిదార్ (53) అర్థ సెంచరీలతో జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో మరో 146 బంతులు మిగిలి ఉండగానే ఎంపీ గెలుపును అందుకుంది.
ఐపీఎల్లో రాజస్థాన్ తరపున..
గతనెలలో జరిగిన ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ 1.10 కోట్ల రూపాయలకు వైభవ్ ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ లో ఆడబోతున్న అతిపిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డు నెలకొల్ప బోతున్నాడు. మరోవైపు రాజస్థాన్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నాయకత్వంతో ఐపీఎల్లో ఆడనుండటం చాలా ఆనందంగా ఉందని వైభవ్ పేర్కొన్నాడు. లెజెండ్ అయినటువంటి ద్రవిడ్ సారథ్యంలో తన ఆటకు మరింత మెరుగులు దిద్దుకుంటానని పేర్కొన్నాడు. ఐపీఎల్ కు సంబంధించి ప్రణాళికలు ఏమీ రచించుకలేదని, తన సహజ ఆటతీరును ఆడతానని పేర్కొన్నాడు. ముఖ్యంగా తొలి సారి ఆడబోతున్న ఐపీఎల్ ను ఆస్వాదిస్తానని వెల్లడించాడు. ఇక గతనెలలో జరిగిన అండర్-19 ఆసియాకప్ లో కూడా వైభవ్ బరిలోకి దిగాడు. ఈ టోర్నీలో 44 సగటుతో 145కి పైగా స్ట్రైక్ రేటుతో 176 పరుగులు సాధించాడు. దీంతో టోర్నీలో రెండో లీడింగ్ స్కోరర్ గా నిలిచాడు. ఈ క్రమంలో యూఏఈ, శ్రీలంకపై రెండు అర్థ సెంచరీలు కూడా సాధించడం విశేషం.