Tejavath Sukanya Bai | హైదరాబాద్: పవర్ లిఫ్టర్ తేజావత్ సుకన్య భాయికి శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన ఏసియా పవర్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన పవర్ లిఫ్టర్ మన ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పారు. గోల్డ్ మెడల్ సాధించిన తేజావత్ సుకన్య భాయ్ తాజాగా స్వస్థలానికి తిరిగొచ్చారు. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న సుకన్య భాయికి తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఘన స్వాగతం పలికారు. 


ప్రభుత్వం సాయం చేస్తే మరిన్ని పతకాలు 
ఈ సందర్భంగా పవర్ లిఫ్టర్ సుకన్య తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం కారణమన్నారు. ఖర్చులకు వెనుకాడకుండా తనను ఆర్థికంగా ప్రోత్సహించి ప్రపంచ స్థాయిలో నిలిపిన తల్లిదండ్రులకు, తాతయ్య రామచంద్రనాయక్‌లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం తరపున మరెన్నో బంగారు పథకాలను సాధించేందుకు సిద్ధమన్నారు. తెలంగాణ ప్రభుత్వం తనకు ఆర్థిక సహాయం అందిస్తే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానన్నారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూర్తి సహాయ సహకారాలతో కెరీర్‌లో ఎదిగానంటూ ఆయనకు సుకన్య భాయి కృతజ్ఞతలు తెలిపారు.


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం (జులై 11న) బంధుమిత్రులతో పాటు వెళ్లి కలుస్తానని చెప్పారు. జులై 7వ తేదీన దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఏషియన్ సౌత్ ఆఫ్రికన్ పసిఫిక్ పవర్ లిఫ్టింగ్‌లో 76 కేజీల విభాగంలో రాష్ట్రానికి చెందిన పవర్ లిఫ్టర్ సుకన్య భాయి స్వర్ణ పతకం సాధించారు. యావత్ భారతావని గర్వించేలా చేశారు. సౌతాఫ్రికాలో జరిగిన ఈ వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో 60 దేశాలు పాల్గొన్నా.. సుకన్య అద్భుత ప్రదర్శనతో బంగారం కైవసం చేసుకున్నారు. ఆదివారం పోచెస్‌స్ట్రూమ్‌లో జరిగిన మహిళల 76 కిలోల బెంచ్‌ ప్రె్‌స విభాగంలో తేజావత్ సుకన్య 135 కేజీల బరువు ఎత్తి టాప్‌లో నిలిచారు.


Also Read: Rahul Dravid: బీసీసీఐ బోనస్‌ తిరస్కరించిన రాహుల్‌ ద్రావిడ్‌- అందుకే జెంటిల్మెన్‌ అయ్యావంటూ కామెంట్స్