Rahul Dravid Refuses BCCI Extra Bonus: క్రికెట్(Cricket)లో తనను జెంటిల్మెన్ అని ఎందుకు అంటారో టీమిండియా మిస్టర్ డిపెండబుల్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్(Rahul Dravid) మరోసారి నిరూపించాడు. టీ 20 ప్రపంచ కప్(T20 World Cup) గెలిచిన సందర్భంగా బీసీసీఐ(BCCI) ప్రకటించిన రూ.125 కోట్ల ప్రైజ్ మనీలో తన వాటాగా వచ్చిన రూ.5 కోట్లలో సగం వదులుకోవాలని రాహుల్ ద్రావిడ్ నిర్ణయించుకున్నాడు.
టీ 20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలిచిన నేపథ్యంలో బీసీసీఐ మొత్తం రూ. 125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. భారత జట్టుకు, కోచింగ్ సిబ్బంది, సహాయక సిబ్బందికి ఆ నగదు పంచనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ఇందులో రూ. 5 కోట్ల రూపాయలు దక్కాయి. అయితే ద్రావిడ్ తన నగదు బహుమతిని రూ. 2.5 కోట్లకు తగ్గించాలని బీసీసీఐని కోరినట్లు జాతీయ వార్త సంస్థలు వెల్లడించాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లతో పోల్చితే తనకు ఎక్కువ డబ్బు తీసుకోవాలనే ఉద్దేశం లేదని... వారితో సమానంగా తనకు కూడా రూ. 2.5 కోట్లే ఇవ్వాలని బీసీసీఐని ద్రావిడ్ కోరినట్లు తెలుస్తోంది. బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌కు ఇచ్చినట్లే తనకు కూడా రూ. 2.5 కోట్ల నగదే ఇవ్వాలని ద్రావిడ్ కోరినట్లు తెలిసింది. తాము ద్రావిడ్ మనోభావాలను గౌరవిస్తామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
అప్పుడు కూడా...
2018లో భారత్ అండర్-19 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న సందర్భంగా అప్పుడు జట్టుకు ప్రధాన కోచ్‌గా ద్రవిడ్ ఇదే విధమైన వైఖరి అవలంభించాడు. ఆ సమయంలో అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన జట్టుకు బీసీసీఐ నజరాన ప్రకటించింది. ఆ నజరానాలో ద్రవిడ్‌కు 50 లక్షల రూపాయలు, మిగిలిన సహాయ సిబ్బందికి 20 లక్షలు, 30 లక్షలు ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. అయితే ద్రవిడ్ ఈ విధానానికి నిరాకరించాడు. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ కాకుండా సహాయక సిబ్బందికి అందరికీ సమానంగా నగదు పంచాలని ద్రావిడ్ సూచించాడు. నగదు పంపిణీ శాతాన్ని మార్చాలని, అందరికీ సమానంగా రివార్డ్ ఇవ్వాలని బీసీసీఐకి సూచించాడు. ద్రవిడ్ సూచనతో అప్పట్లో బీసీసీఐ సహాయక సిబ్బందిలోని ప్రతి సభ్యుడికి రూ. 25 లక్షలు అందజేసింది. ద్రవిడ్ నిస్వార్థంగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పడు తాను జెంటిల్మెనే అని నిరూపించుకుంటున్నాడు. క్రికెట్‌లో చురుగ్గా ఆడే రోజుల్లో జట్టుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన ద్రవిడ్... ఇప్పుడు కూడా అదే విధానం అవలంభిస్తున్నాడు.
ఇటీవల రాహుల్ నేతృత్వంలో టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన వేల భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ ద్రవిడ్‌కు భారత ప్రభుత్వం... భారతరత్న ప్రదానం చేస్తే సముచితమని అన్నాడు. భారత ప్రభుత్వం.. రాహుల్‌ను భారతరత్నతో సత్కరిస్తే అది సముచితంగా ఉంటుందని గవాస్కర్ అన్నాడు.