Gautam Gambhir as the new Head Coach of the Indian Cricket Team: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్‌ను నియమించినట్లు బీసీసీఐ ప్రకటించింది. అంతా ఊహించినట్లుగానే టీమిండియా మాజీ క్రికెటర్ గంభీర్‌కు భారత క్రికెట్ టీమ్ బాధ్యతల్ని అప్పగించారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. రాహుల్ ద్రావిడ్ పదవీకాలం టీ20 వరల్డ్ కప్ తో ముగియగా.. బీసీసీఐ గంభీర్ వైపు మొగ్గు చూపింది. త్వరలో శ్రీలంకతో జరగనున్న మూడు వన్డేలు, 3 టీట్వంటీల సిరీస్ నుంచి గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. జులై 27న ఈ సిరీస్ ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
‘టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు స్వాగతం. మోడ్రన్ డే క్రికెట్ చాలా వేగంగా మారుతోంది. సరిగ్గా ఈ సమయంలో గంబీర్ లాంటి వ్యక్తి సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించగలరు. తన క్రికెట్ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు చేరుకున్న, ఎంతో సాధించిన గంభీర్ భారత క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్తాడని నమ్మకం ఉంది. గంభీర్ విజన్ టీమిండియాను ముందుకు నడిపిస్తుందని భావిస్తున్నాను. టీమిండియా కొత్త కోచ్ కు బీసీసీఐ అన్ని విధాలుగా సహకారం అందిస్తుంది. గంభీర్ కొత్త ఇన్నింగ్స్’ జై షా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగియనుందని కొత్త కోచ్ కోసం మే 13న బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే రాహుల్ ద్రావిడ్ శిక్షణలో టీమిండియా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 విజేతగా నిలిచింది. 17 ఏళ్ల తరువాత పొట్టి ప్రపంచ కప్ ను భారత్ ముద్దాడింది. గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమితో భారత్ రన్నరప్ తో సరిపెట్టుకుంది. ఇంగ్లాండ్ లో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ లో భారత్ రన్నరప్‌గా నిలిచింది.
రాహుల్ ద్రావిడ్ యువ ఆటగాళ్లను తీర్చిదిద్ది టీమిండియాకు అందించాడు. వారితో పొట్టి ప్రపంచ కప్ కలను దశాబ్దంన్నర తరువాత సాకారం చేశాడు. ద్రావిడ్ హెడ్ కోచ్‌గా భారత్ అసమాన ప్రదర్శన చేసిందని బీసీసీఐ కొనియాడింది. బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ లకు అభినందనలు తెలిపింది.