Rohit Sharmas About Rahul Dravid: టీ 20 ప్రపంచకప్(T20 world Cup)తో విశ్వ విజేతలుగా నిలిచిన అనంతరం టీమిండియా హెడ్ కోచ్ పదవికి రాహుల్ ద్రావిడ్(Rahul Dravid) గుడ్ బై చెప్పేశాడు. బీసీసీఐ(BCCI) కూడా కొత్త కోచ్ వేటలో నిమగ్నమై పోయింది. ఈ దశలో టీమిండియా సారధి రోహిత్ శర్మ(Rohit Sharma) హెడ్‌కోచ్‌గా బాధ్యతలు వదిలి వెళ్తున్న రాహుల్ ద్రావిడ్‌పై ఇన్ స్టాలో భావోద్వేగ పోస్ట్ చేశాడు. ఈ భావోద్వేగభరిత పోస్ట్‌తో హిట్‌మ్యాన్ మరోసారి అభిమానుల మనసులు దోచుకున్నాడు. ద్రావిడ్ భాయ్ నువ్వే నా ఫ్రెండ్.. గురువు అంటూ రోహిత్ చేసిన సుదీర్ఘ పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ యథాతథంగా....
రోహిత్ పోస్ట్‌లో ఏముందంటే...
" క్రికెట్‌లో మీరు సంపూర్ణమైన ప్రతిభావంతులు... మీ విజయాలను కీర్తిని అంతా వదిలేసి మాతో కోచ్‌గా నడిచారు. మీ మార్గనిర్దేశంలోనే మేం ఈ స్థాయికి వచ్చాం. టీ 20 ప్రపంచకప్ మీకు వచ్చిన బహుమతి. క్రికెట్‌పై మీకున్న ప్రేమ ఇంత కాలం తర్వాత కూడా”చెక్కు చెదరలేదు. మిమ్మల్ని నా భార్య... వర్క్ వైఫ్ అని పిలుస్తుంది. ఆమె అలా పిలవడం నాకు చాలా సంతోషంగానే ఉంది. మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మీతో ఉన్న ప్రతి జ్ఞాపకం నాకు ఎంతో విలువైనది. మీరు సాధించలేక పోయిన ఏకైక విషయం ప్రపంచకప్. దాన్ని మీ నేతృత్వంలో మేం సాధించడం చాలా సంతోషంగా ఉంది.
రాహుల్ భాయ్ నువ్వు నా విశ్వాసానివి. నా కోచ్‌వి. నా స్నేహితుడివి. నిన్ను అలా పిలవడం నాకు దక్కిన గొప్ప అదృష్టం. మీ గురించి వర్ణించేందుకు.. నా భావాలను సరిగ్గా వ్యక్తపరిచేందుకు నాకు పదాలు కూడా దొరకడం లేదు. కానీ ఏదో ఇలా ప్రయత్నించా. చిన్నప్పటి నుంచి నేను కోట్లాది మంది అభిమానుల లాగానే మిమ్మల్ని చూస్తూ పెరిగాను. కానీ మీతో సన్నిహితంగా ఉండే అవకాశం నాకు దక్కినందుకు నేను చాలా అదృష్టవంతుడిని. క్రికెట్ పట్ల మీ వినయం.. ఆట పట్ల మీకున్న ప్రేమ.. అనుభవం అద్భుతం. మీ సమర్థవంతమైన నాయకత్వానికి, వ్యూహాత్మకతకు తిరుగులేదు. మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన సందర్భంగా మీకు అంతా శుభమే జరగాలి. “ అని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నాడు.
రాహుల్ గుడ్‌బై
టీమిండియా కోచ్‌గా దాదాపు మూడు సంవత్సరాల సుదీర్ఘ పదవీకాలానికి రాహుల్ గుడ్ బై చెప్పాడు. టీమిండియా హెడ్ కోచ్‌గా కొనసాగాలని బీసీసీఐ కోరినా ద్రావిడ్ తిరస్కరించాడు. అయితే గత ఏడాది ఆస్ట్రేలియా చేతిలో వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోయినప్పుడే రాహుల్ కోచ్ పదవికి వీడ్కోలు పలకాలని అనుకున్నాడు. అయితే రోహిత్ ఫోన్ కాల్‌తో ఆ తర్వాత కూడా ద్రావిడ్ కోచ్‌గా కొనసాగాడు.