Jay Shah To Be New ICC Boss : ప్రపంచ క్రికెట్‌ పెద్దన్నగా చలామణి అవుతున్న బీసీసీఐ(BCCI)... మరోసారి ఐసీసీ ఛైర్మన్‌(ICC) పదవిపై కన్నేసినట్లు తెలుస్తోంది. బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా(Jay Shah) త్వరలో ఆ పదవికి గుడ్ బై చెపి... ఐసీసీ ఛైర్మన్‌గా పోటీ చేస్తారన్న ఊహగానాలు వస్తున్నాయి. ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా 2019 నుంచి కొనసాగతున్న జై షా... ఇప్పుడు ఐసీసీ ఛైర్మన్‌ పదవిని చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ కార్యదర్శికి గుడ్‌ బై చెప్పి... ఐసీసీ ఛైర్మన్‌ పదవి చేపట్టేందుకు జై షా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఐసీసీ ఛైర్మన్‌గా గత నాలుగేల్లుగా కొనసాగుతున్న గ్రెగ్‌ బార్క్‌లే ఎంపికవ్వడంలో జై షా కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు జై షా కనుక ఐసీసీ ఛైర్మన్‌ పదవికి పోటీ పడితే ఏకగ్రీవమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. గతంలో భారత్ నుంచి జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్ ఐసీసీ ఛైర్మన్ పదవి చేపట్టారు. 


కొలంబో మీటింగ్‌పైనే అందరి దృష్టి

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఈ నెలాఖరులో కొలంబోలో వార్షిక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశం అజెండాలో ఐసీసీ ఛైర్మన్‌ పదవికి సంబంధించిన విషయం లేదు. అయితే ఈ ఏడాది నవంబర్‌లో ఐసీసీ కొత్త ఛైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. కొలంబోలో వార్షిక సదస్సు జూలై 19 నుంచి 22 వరకు జరగనుంది. ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్‌గా ఉన్న గ్రెగ్ బార్క్‌లే స్థానంలో జై షా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఐసీసీ ఛైర్మన్‌ ఎన్నిక సమయంలో న్యూజిలాండ్‌కు  చెందిన బార్క్‌లేకు బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా పూర్తి మద్దతు తెలిపారు. ఇప్పుడు బార్క్‌లేకు మరోసారి దఫా ఐసీసీ ఛైర్మన్‌గా కొనసాగే అర్హత ఉంది. బార్క్‌ లే కూడా పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నాయి. అయితే జై షా కనుక పోటీ చేస్తే ఏకగ్రీవంగా ఎన్నిక అవుతాడని అందరూ భావిస్తున్నారు. ఒకవైళ ఐసీసీ ఛైర్మన్ జై షా ఎన్నికైతే మూడేళ్లపాటు సేవలందిస్తారు. ఇదే జరిగితే జై షా మళ్లీ బీసీసీఐ నిబంధనల ప్రకారం 2028లోనే బీసీసీఐ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంది. 

 

ఐసీసీ కార్యాలయాన్ని మారుస్తారా..?

ఒకవేళ జై షా ఐసీసీ ఛైర్మన్‌ అయితే ఐసీసీ ప్రధాన కార్యాలయాన్ని దుబాయ్ నుంచి ముంబైకి మార్చే అవకాశం ఉందని క్రికెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. అయితే కొలంబోలో జరిగే సమావేశంలో దీనిపై చర్చ జరిగే అవకాశం లేదు. ఇటీవల అమెరికా, వెస్టిండీస్‌లో జరిగిన ట్వంటీ 20 ప్రపంచ కప్ నిర్వహణపై విమర్శలు వచ్చిన వేళ ఐసీసీలో కీలక మార్పులు తెచ్చేందుకు జై షా ఆసక్తి చూపుతున్నట్లు భావిస్తున్నారు. కొలంబోలో జరిగే వార్షిక సదస్సులో ఐసీసీ ఛైర్మన్‌ ఎన్నికకు సంబంధించిన టైమ్‌లైన్‌ను అధికారికంగా రూపొందించాలని భావిస్తున్నారు. వార్షిక సమావేశంలో డైరెక్టర్ల కోసం జూలై 19న ఎన్నికలు జరగనున్నాయి. ICC బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఒక్కొక్కరికి రెండేళ్ల కాలపరిమితి ఉంటుంది. ఈ కాలపరిమితి ముగియడంతో మూడు స్థానాల కోసం పదకొండు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.