ICC Players Of The Month June 2024:  టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup)లో అద్భుత బౌలింగ్‌తో భారత జట్టును విశ్వ విజేతలుగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా(Bumrah)... ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యాడు. బుమ్రాతోపాటు టీమిండియా మహిళ జట్టులో స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన(Smruti Mandana) కూడా ఈ అవార్డుకు ఎంపిక కావడం అభిమానుల్లో ఆనందాన్ని పెంచింది. ఈ ఏడాది జూన్‌కు సంబంధించి ఐసీసీ బెస్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డును బుమ్రా, స్మృతి మంధాన అందుకున్నారు. 2024 జూన్‌కు సంబంధించిన రెండు అవార్డులు భారత ఆటగాళ్లకే రావడం విశేషం.

గత వారం జరిగిన ఓటింగ్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లకు ఎక్కువ ఓట్లు వచ్చినట్లు ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అమెరికా- వెస్టిండీస్‌ సంయుక్తంగా నిర్వహించిన ఐసీసీ టీ 20 ప్రపంచకప్‌లో బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. ఈ ఘనతను అందుకున్న కొన్ని రోజులకే బుమ్రాను మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించడంతో అభిమానులు బూమ్ బూమ్‌ బుమ్రా అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. బుమ్రాకు ఇదే మొదటి ICC  ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు. 

 





బూమ్‌ బూమ్‌ బుమ్రా 

ఐసీసీ టీ 20 ప్రపంచకప్‌ను గెలవడంలో బుమ్రాదే అత్యంత కీలకపాత్ర. అద్భుతమైన నియంత్రణతో టోర్నమెంట్‌ అసాంతం బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కీలకమైన సమయంలో టీమిండియాకు వికెట్లు అందించి విజయాలకు బాటలు వేశాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మహమ్మద్ రిజ్వాన్, ఇఫ్తికర్ అహ్మద్‌ల వికెట్లు తీసి భారత్‌కు విజయాన్ని అందించాడు. ఆఫ్ఘానిస్తాన్‌పై ఏడు పరుగులకే మూడు వికెట్లు తీసిన బుమ్రా.. బంగ్లాదేశ్‌పై 13 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. సెమీఫైనల్‌లో 12 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో ఆరంభ ఓవర్లో హెండ్రింక్స్‌ను, తన చివరి ఓవర్‌లో మార్కో జాన్సెన్‌ను అవుట్ చేసి భారత్‌ను విశ్వ విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. బుమ్రా బౌలింగ్‌తో దక్షిణాఫ్రికా పైనల్లో ఓడిపోవడంతో 13 ఏళ్ల ప్రపంచ కప్‌ కలకు భారత జట్ట తెరదించింది. ఈ టోర్నమెంట్‌లో బుమ్రా 8.26 సగటుతో.. 15 వికెట్లు తీశాడు. ఈ మెగా టోర్నమెంట్‌లో బుమ్రా ఎకానమీ కేవలం 4.17 కావడం విశేషం. బుమ్రా టీ 20 వరల్డ్‌కప్‌లో ICC ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు. జూన్‌లో ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందన్న బుమ్రా... ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు. తన కుటుంబ సభ్యులకు, సహచరులకు, కోచ్‌లకు, ఓటు వేసిన అభిమానులకు బుమ్రా ధన్యవాదాలు తెలిపాడు.








స్మృతి మంధానకు కూడా...

దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న స్మృతి మంధాన కూడా  ICC  ప్లేయర్ ఆఫ్ ది మంత్ జూన్‌కు ఎంపికైంది. మంధాన మెరుపు బ్యాటింగ్‌తో దక్షిణాఫ్రికాపై టీమిండియా వన్డే సిరీస్‌ విజయాన్ని అందించింది. మంధానకు కూడా ఇదే తొలి ICC మహిళా ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కావడం విశేషం. 2021లో అవార్డులు ప్రారంభమైనప్పటి నుంచి ఐసీసీ పురుషులు, మహిళలకు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ఇస్తోంది. జూన్ నెలలో ICC మహిళా ప్లేయర్ ఆఫ్ ది మంత్‌ను గెలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని మంధాన తెలిపింది.