Challenges To Gautam Gambhir : టీమిండియా హెడ్‌ కోచ్‌(Team India Head coach)గా గౌతం గంభీర్‌(Gautam Gambhir)ను నియమించడం వెనక బీసీసీఐ(BCCI) పెద్ద కసరత్తే చేసింది. మైదానం లోపల, బయట దూకుడుగా ఉండే గంభీర్‌ను... హెడ్ కోచ్‌గా నియమించాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే ఐపీఎల్‌లో తన వ్యూహాలతో కోల్‌కత్తాను విజేతగా నిలిపిన గంభీర్‌.. బీసీసీఐ కోచ్‌గా తాను అర్హుడినేనని చాటుకున్నాడు. ఆట కోసం వంద శాతం కష్టపడే గుణమే గంభీర్‌ను టీమిండియా హెడ్‌ కోచ్‌గా చేసిందని చాలామంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంలో 2009లో వీరేంద్ర సెహ్వాగ్‌ చేసిన వ్యాఖ్యలను చాలామంది గుర్తు చేసుకుంటున్నారు. 2009లో నేపియర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా ఫాలో ఆన్‌ ఆడుతోంది. ఆ మ్యాచ్‌లో టీమిండియాను ఓటమి బారి నుంచి కాపాడేందుకు గౌతమ్ గంభీర్ 11 గంటలపాటు క్రీజులో పాతుకుపోయాడు. 436 బంతుల్లో 137 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌ అనంతరం సెహ్వాగ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు గంభీర్‌ సెకండ్‌ వాల్‌ అయ్యాడని కితాబిచ్చాడు. ఇప్పుడు అదే నిజమైంది. ఇప్పటివరకూ టీమిండియా ఫస్ట్‌ వాల్‌ రాహుల్‌ ద్రావిడ్‌ మార్గ నిర్దేశంలో అద్భుతాలు చేసిన భారత క్రికెటర్లు ఇప్పుడు సెకండ్‌ వాల్‌ గౌతం గంభీర్‌ నేతృత్వంలో ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ఫస్ట్‌ వాల్‌ ద్రావిడ్‌ తన బాధ్యతలను గౌతం గంభీర్‌కు ఇవ్వడంతో అతడు నిజంగానే సెకండ్ వాల్‌ అయిపోయాడు. 

 


 

ద్రావిడ్‌ను మరిపిస్తాడా..?

రాహుల్‌ ద్రావిడ్ తన రెండున్నరేళ్ల పదవీకాలంలో భారత్‌ను పటిష్టంగా అద్భుతాలు చేసే జట్టుగా తయారు చేశాడు. సీనియర్లు, జూనియర్లను ఒకే తాటిపైకి తెచ్చి అద్భుతాలు చేశాడు. కోచ్‌లుగా అనిల్‌ కుంబ్లే, రవిశాస్త్రి, రాహుల్‌ ద్రావిడ్‌ల వారసత్వాన్ని కొనసాగించాల్సిన బాధ్యత గంభీర్‌పై ఉంది. రాబోయే మూడున్నర సంవత్సరాల పదవీ కాలంలో గంభీర్‌కు చాలా సవాళ్లు ఎదురుకానున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మాత్రమే పనిచేసిన గంభీర్‌కు కోచ్‌గా పెద్దగా అనుభవం లేదనే చెప్పాలి. ద్రావిడ్‌ 2015-2019 మధ్య కాలంలో టీమిండియా A జట్టుకు... అండర్‌ 19 జట్టుకు కోచ్‌గా విధులు నిర్వహించాడు. కానీ గంబీర్‌ కేవలం ఐపీఎల్‌కే పరిమితమయ్యాడు. ఈ పరిస్థితుల్లో గంభీర్‌ కోచ్‌గా ఎలాంటి ముద్ర వేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.  

 

సాహసోపేతమైన నిర్ణయాలకు తిరుగులేదు

మైదానంలో గౌతం గంభీర్‌ చాలా దూకుడుగా ఉంటాడు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి భయపడడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అపార అనుభవం ఉండడం గంభీర్‌కు కలిసివస్తుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌లు, వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గంభీర్‌కు సవాల్‌ విసురుతున్నాయి. వీటిని గంభీర్‌ ఎలా అధిగమిస్తాడో చూడాలి. గంభీర్ శ్రీలంక పర్యటనతో ఆ బాధ్యతలు స్వీకరించనున్నాడు. 2026లో స్వదేశంలో జరిగే T20 ప్రపంచ కప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగనున్న భారత్‌కు గంభీర్‌ ముచ్చటగా మూడో కప్పు అందిస్తాడేమో చూడాలి .