Sanju Samson: అభిమానుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు అనిపిస్తోంది! టీమ్‌ఇండియా క్రికెటర్‌ సంజూ శాంసన్‌ను (Sanju Samson) భారత్‌-ఏ కెప్టెన్‌గా నియమించింది. న్యూజిలాండ్‌-ఏతో జరిగే మూడు వన్డేల సిరీసుకు సెలక్టర్లు జట్టును ప్రకటించారు.


మరికొన్ని రోజుల్లో న్యూజిలాండ్‌-ఏ భారత్‌లో పర్యటిస్తోంది. టీమ్‌ఇండియాతో మూడు వన్డేలు ఆడనుంది. సెప్టెంబర్‌ 22 నుంచి ఈ సిరీస్‌ మొదలవుతుంది. 22, 25, 27న మ్యాచులు జరుగుతాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం ఇందుకు వేదిక.


భారత్‌ ఏ జట్టు: పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, రాహుల్‌ త్రిపాఠి, రజత్‌ పాటిదార్‌, సంజు శాంసన్ (కెప్టెన్‌), కేఎస్‌ భరత్‌ (వికెట్‌ కీపర్‌), కుల్‌దీప్ యాదవ్‌, షాబాజ్‌ అహ్మద్‌, రాహుల్‌ చాహర్‌, తిలక్‌ వర్మ, కుల్దీప్‌ సేన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, నవదీప్‌ సైని, రాజ్‌ అంగద్‌ బవా


మరో నెల రోజుల్లో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ జరుగుతోంది. ఈ మెగా టోర్నీకి సంజూ శాంసన్‌ను తీసుకోలేదు. దాంతో అభిమానులు బీసీసీఐపై ఆగ్రహంగా ఉన్నారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీసుల్లోనూ చోటివ్వకపోవడాన్ని వారు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా న్యూజిలాండ్‌-ఏ సిరీసును ప్రకటించడం గమనార్హం. సంజూను కెప్టెన్‌గా నియమించడం ప్రత్యేకం.


బీసీసీఐకి వ్యతిరేకంగా ఆందోళన


ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు సంజు శాంసన్‌ను ఎంపిక చేయకపోవడంతో బోర్డుపై ఆక్రోశం వెల్లగక్కేందుకు ఫ్యాన్స్‌ సిద్ధమవుతున్నారని తెలిసింది. తిరువనంతపురంలో భారత్‌, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచు జరిగేటప్పుడు భారీ నిరసనలు ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. ఈ మేరకు ఐఏఎన్‌ఎస్‌ ఓ కథనం పబ్లిష్‌ చేసింది.


ఈ ఏడాది ఐపీఎల్‌లో సంజూ శాంసన్‌ అదరగొట్టాడు. తన కెప్టెన్సీ నైపుణ్యంతో జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. రన్నరప్‌గా నిలిపాడు. 17 మ్యాచుల్లో 28 సగటు, 146 స్ట్రైక్‌రేట్‌తో 458 పరుగులు చేశాడు. టీమ్‌ఇండియా తరఫున 2022లో 6 వన్డేలు, 6 టీ20లు ఆడాడు. వెస్టిండీస్‌, జింబాబ్వే పర్యటనల్లో అందరినీ ఆకట్టుకున్నాడు. అయినప్పటికీ ఆసియాకప్‌లో అతడికి చోటివ్వలేదు. ఇక ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ తుది 15 మందిలో తీసుకోలేదు. కనీసం రిజర్వుగా అయినా ఎంపిక చేయలేదు.


ఇవన్నీ పక్కన పెడితే ఏ మాత్రం ఆకట్టుకోని రిషభ్ పంత్‌ను తీసుకోవడం సంజూ అభిమానులకు నచ్చలేదు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ జట్టును ప్రకటించనప్పటి నుంచి అతడికి మద్దతుగా ట్వీట్లు చేస్తూనే ఉన్నారు, సోషల్‌ మీడియాలో ప్రతి రోజు ఈ అంశాన్ని ట్రెండింగ్‌లో ఉంచుతున్నారు. సునిల్‌ గావస్కర్‌, రవిశాస్త్రి సహా మరికొందరు మాజీలు అతడిని తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిందని పేర్కొన్నారు. ఆసీస్‌ బౌన్సీ పిచ్‌లు అతడి బ్యాటింగ్‌ శైలికి నప్పుతాయని అన్నారు. అయినప్పటికీ సెలక్టర్ల నుంచి స్పందన లేకపోవడంతో ఫ్యాన్స్‌ నిరసనలు తెలపాలని ప్లాన్‌ చేస్తున్నారు.


అతి త్వరలోనే దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లో పర్యటించనుంది. మూడు టీ20ల్లో ఒకటి తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలో తమ ఆగ్రహాన్ని బీసీసీఐకి చూపించాలని సంజూ శాంసన్‌ ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. బోర్డుకు వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టాలని భావిస్తున్నారు. సంజూ చిత్రంలో కూడిన టీషర్టులు ధరించి ఆందోళన చేపడతారని తెలిసింది. మొత్తంగా ఇది దేనికి దారి తీస్తుందో చూడాలి.