ప్రపంచంలోనే నంబర్ వన్, మోస్ట్ ఎంటర్‌టైనింగ్ టీ20 లీగ్ ఐపీఎల్ అయిపోయింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచి, నాలుగోసారి ట్రోఫీని సాధించింది. అయితే అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఇది ఫుల్‌స్టాప్ కాదు, కామా మాత్రమే. ఎందుకంటే వారం తిరక్కముందే టీ20 వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు మా టీం గొప్ప అంటే, మాది గొప్ప అని యుద్ధాలు చేసుకున్న వారు.. ఒకళ్ల భుజాల మీద ఒకళ్లు చేతులు వేసుకుని టీమిండియా అంటూ నినాదాలు చేస్తారు.


భారత జట్టుకు కూడా ఈ కప్పు ఎంతో ముఖ్యం. ఎందుకంటే.. ఈ టీ20 వరల్డ్‌కప్ తర్వాత కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించాడు. మాస్టర్ మైండ్ ధోని మొదటిసారి టీంకు మెంటార్‌గా వచ్చాడు. కాబట్టి ఈ టోర్నీ భారతజట్టుకు కచ్చితంగా కీలకమైనదే. అయితే ఐపీఎల్ జరిగిన వారానికే టీ20 వరల్డ్‌కప్ కూడా జరుగుతుంది కాబట్టి జట్టులో ఎవరు ఎంత ఫాంలో ఉన్నారనే విషయం ఈ పాటికే క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు భారత జట్టులో ఉన్న సభ్యుల ఐపీఎల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ ప్రపంచకప్‌లో ఎవరు కీలకంగా ఉండనున్నారో ఒకసారి చూద్దాం..


విరాట్ కోహ్లీ (కెప్టెన్): ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. 15 ఇన్నింగ్స్‌లో 405 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్థ సెంచరీలు ఉన్నాయి. ఈ ఒక్క ఐపీఎల్ సీజన్ మాత్రమే కాదు. గత సంవత్సర కాలంగా విరాట్ కోహ్లీ తన ఫాం కోల్పోయాడు. పరుగుల చేయడానికి ఎంతగానో ఇబ్బంది పడుతున్నాడు. ఈ వరల్డ్‌కప్ భారత్ గెలవాలంటే కోహ్లీ కచ్చితంగా ఫాంలోకి రావాల్సిందే.


రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్): వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ ఐపీఎల్‌లో అంత ఆశాజనకంగా ఆడలేదు. 13 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 380 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క అర్థ సెంచరీ మాత్రమే ఉంది. కోహ్లీ తర్వాత కెప్టెన్‌గా రోహిత్‌నే ఎంచుకుంటారని టాక్ నడుస్తుంది కాబట్టి.. ఈ వరల్డ్‌కప్‌లో హిట్ మ్యాన్ పెర్ఫార్మెన్స్ కచ్చితంగా సూపర్ హిట్ అవ్వాల్సిందే..


కేఎల్ రాహుల్: ఈ ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. కేవలం 13 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 626 పరుగులు చేశాడు. తన సగటు 62.60గా ఉండగా, స్ట్రైక్ రేట్ 138.8 వరకు ఉంది. చెన్నైపై కొట్టిన 98 పరుగులు అయితే టోర్నీలోనే బెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో ఒకటి. మొత్తం ఆరు అర్థ సెంచరీలు సాధించాడు. ఇదే ఫాం టీ20 వరల్డ్ కప్‌లో కూడా కొనసాగిస్తే భారత జట్టుకి అదే పది వేలు.


సూర్యకుమార్ యాదవ్: ఈ సీజన్‌లో విఫలం అయిన వారిలో సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నాడు. 14 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 317 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు అర్థ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ మాత్రం అద్భుతంగా ఉంది. 143.43 స్ట్రైక్ రేట్‌తో సూర్యకుమార్ యాదవ్ ఈ పరుగులు సాధించాడు. ఈ స్ట్రైక్‌రేట్‌తో పాటు స్థిరంగా బ్యాటింగ్ చేస్తే మిడిలార్డర్‌లో జట్టుకు ఉపయోగపడే బ్యాట్స్‌మెన్ అవుతాడు.


రిషబ్ పంత్: కెప్టెన్‌గా పంత్‌కు ఇది అద్భుతమైన సీజన్. లీగ్ దశలో తన కెప్టెన్సీతో జట్టును టాప్‌లో నిలిపాడు. అయితే ఆ కెప్టెన్సీ ఒత్తిడి తన బ్యాటింగ్‌పై పడ్డట్లు అనిపిస్తుంది. ఈ సీజన్‌లో మొత్తం 16 ఇన్సింగ్స్‌ల్లో 419 పరుగులను పంత్ సాధించాడు. ఇందులో మూడు అర్థ సెంచరీలు ఉన్నాయి. వరల్డ్‌కప్‌లో కెప్టెన్సీ ఒత్తిడి ఉండదు కాబట్టి పంత్ నుంచి కొన్ని మాస్ ఇన్నింగ్స్‌లు మనం ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు.


ఇషాన్ కిషన్: ఈ సీజన్‌లో ఇషాన్ కిషన్ 10 మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు. ఈ 10 ఇన్నింగ్స్‌ల్లో తను 241 పరుగులు సాధించాడు. తన స్ట్రైక్ రేట్ 133.88గా ఉంది. రెండు అర్థ సెంచరీలు ఉన్నాయి. పంత్ జట్టులో ఉన్నాడు కాబట్టి ఇషాన్‌కు ఈ కప్‌లో ఏ మేరకు అవకాశాలు దక్కుతాయో చూడాలి.


హార్దిక్ పాండ్యా: oఐపీఎల్ 2021 సీజన్ హార్దిక్‌కు కూడా పెద్దగా కలిసిరాలేదు. 12 మ్యాచ్‌లు ఆడిన పాండ్యా.. 11 ఇన్నింగ్స్‌ల్లో 127 పరుగులు మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా 113.39 మాత్రమే. బౌలింగ్ కూడా ఈ సీజన్‌లో అస్సలు చేయలేదు. కానీ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కాబట్టి స్క్వాడ్‌లో అత్యంత కీలకం అవుతాడు. వీలైనంత త్వరగా తను ఫాంలోకి వస్తే మంచిది.


రవీంద్ర జడేజా: సర్ రవీంద్ర జడేజా ఈ సీజన్‌లో చెన్నై తరఫున అద్భుతంగా ఆడాడు. 12 ఇన్నింగ్స్‌లో 227 పరుగులు చేశాడు. చూడటానికి ఈ స్కోరు తక్కువగానే కనిపించవచ్చు. కానీ తను ఎక్కువగా స్లాగ్ ఓవర్లలోనే బ్యాటింగ్‌కి వచ్చేవాడు కాబట్టి తన నుంచి ఎక్కువ స్కోరు ఎక్స్‌పెక్ట్ చేయలేం. తన స్ట్రైక్ రేట్ ఏకంగా 145.51గా ఉంది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో హర్షల్ పటేల్ వేసిన ఒకే ఓవర్లో 37 పరుగులు రాబట్టడం కూడా అస్సలు మర్చిపోలేం. బౌలింగ్‌లో కూడా 13 వికెట్లు తీశాడు. ఎకానమీ రేట్ కూడా 7.06 మాత్రమే. జడేజా ఎంత అద్భుతమైన ఫీల్డరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లు పట్టడంతో పాటు.. విలువైన పరుగులు కూడా కాపాడతాడు.


రాహుల్ చాహర్: ముంబై ఇండియన్స్ తరఫున ఈ ఐపీఎల్ ఆడిన రాహుల్ చాహర్ మంచి ప్రదర్శన కనపరిచాడు. ఆడిన 11 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. తన ఎకానమీ రేటు 7.39గా ఉంది. బౌలింగ్ యావరేజ్ 19.84గా ఉంది. ఈ వరల్డ్‌కప్‌లో మంచి ప్రదర్శన కనపరిస్తే.. జట్టులో తన ప్లేస్‌కు ఢోకా ఉండదు.


రవిచంద్రన్ అశ్విన్: ఈ సీజన్‌లో అశ్విన్ ప్రదర్శన కాస్త నిరాశాజనకంగానే ఉంది. ఆడిన 13 మ్యాచ్‌ల్లో కేవలం 7 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అయితే తన ఎకానమీ రేటు 7.41 మాత్రమే కావడం విశేషం. పొదుపుగా బౌలింగ్ చేసే బౌలర్లు కావాలనుకుంటే అశ్విన్‌కు అవకాశం దక్కవచ్చు.


శార్దూల్ ఠాకూర్: 2021 ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్నది శార్దూలే. 16 మ్యాచ్‌ల్లో 21 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ ఎకానమీ కాస్త ఎక్కువగా ఉంది. ప్రతి ఓవర్‌కు 8.8 పరుగులను శార్దూల్ ఠాకూర్ సమర్పించుకున్నాడు. కీలక సమయంలో వికెట్లు తీయడానికి శార్దూల్ కంటే మంచి ఆప్షన్ ఉండదు. అందుకేనేమో చివరి నిమిషంలో అక్షర్ పటేల్‌ను తప్పించి శార్దూల్‌ను జట్టులోకి తీసుకున్నారు. బ్యాటింగ్‌లో హిట్టింగ్ చేయగల సామర్థ్యం కూడా శార్దూల్‌కు ఉంది.


వరుణ్ చక్రవర్తి: ఈ సీజన్ వరుణ్ చక్రవర్తికి కూడా బాగా కలిసొచ్చింది. ఏకంగా మిస్టరీ స్పిన్నర్ల జాబితాలో చేరిపోయాడు. ఆడిన 17 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి ఎకానమీ కేవలం 6.58 మాత్రమే. ఈ వరల్డ్‌కప్‌లో వరుణ్ కచ్చితంగా ప్లస్ అవుతాడు.


జస్‌ప్రీత్ బుమ్రా: ఐపీఎల్‌లో బుమ్రా విఫలం అవ్వడం అంటే అది అత్యంత అరుదనే చెప్పాలి. ఈ సీజన్‌లో కూడా బుమ్రా 21 వికెట్లతో టాప్-3లో ఉన్నాడు. తన ఎకానమీ 7.45గా ఉంది. టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున ప్రధాన బౌలర్ బుమ్రానే కానున్నాడు. 


భువనేశ్వర్ కుమార్: ఒకప్పుడు భారత జట్టులో ప్రధాన బౌలర్‌గా ఉన్న భువీ తర్వాత గాయాలతో తన స్థానాన్ని కోల్పోయాడు. ఈ ఐపీఎల్‌లో కూడా తన ప్రదర్శన అంత గొప్పగా లేదు. 11 మ్యాచ్‌ల్లో కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీశాడు. ఎకానమీ 7.97గా ఉంది.


మహ్మద్ షమీ: ఈ ఐపీఎల్ షమీకి కూడా బాగా కలిసొచ్చింది ఆడిన 14 మ్యాచ్‌ల్లో 19 వికెట్లను షమీ చేజిక్కించుకున్నాడు. అతని ఎకానమీ రేట్ కూడా 7.5 మాత్రమే. కాబట్టి ఈ వరల్డ్‌కప్‌లో టీమిండియాకు ఇతను మంచి బలం అయ్యే అవకాశం ఉంది.


అయితే జట్టులో అందరూ టాలెంటెడ్ ఆటగాళ్లే. తమదైన రోజున మ్యాచ్‌ను మలుపు తిప్పే సత్తా ఉన్నవాళ్లే. కాబట్టి అంతా తమ స్థాయికి తగ్గట్లు ఆడి.. కెప్టెన్‌గా కోహ్లీకి తన చివరి వరల్డ్ కప్ అందించి.. ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా లేదనే అపవాదును తొలగించాలని ఆశిద్దాం.


Also Read: 17 ఏళ్ల తర్వాత పాక్ లో టీం ఇండియా పర్యటన... ఆసియా కప్ 2023 హోస్టింగ్ హక్కులు దక్కించుకున్న పాకిస్థాన్..!


Also Read: ఛాంపియన్ సూపర్ కింగ్స్.. నాలుగోసారి ట్రోఫీని ముద్దాడిన చెన్నై.. ఒత్తిడికి చిత్తయిన కోల్‌కతా


Also Read: ఈ సీజన్ లో అసలైన విజేత కోల్ కతా... ఐపీఎల్ సెకండ్ పార్ట్ లో ఆ జట్టు గొప్పగా ఆడింది... సీఎస్కే కెప్టెన్ ధోనీ కామెంట్స్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి