ఐపీఎల్ ఫైనల్ లో కళ్లు చెదిరే ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ కప్పు ఎగురేసుకుపోయింది. శుక్రవారం రాత్రి దుబాయ్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడిన ధోనీ సేన 27 పరుగులతో తేడా ఘనవిజయం సాధించింది. దీంతో ముంబయి ఇండియన్స్ తర్వాత అత్యధికంగా నాలుగు సార్లు టైటిల్ సాధించిన జట్టుగా చెన్నై నిలిచింది. మ్యాచ్ అనంతరం చైన్నై సారథి ధోనీ మాట్లాడాడు. ఈ సీజన్‌లో అసలైన విజేత కోల్‌కతా అని తన అభిప్రాయాన్ని తెలిపాడు. కరోనా వల్ల ఈ టోర్నీ రెండు భాగాలుగా జరగడం మోర్గాన్ టీమ్‌కు బాగా కలిసొచ్చిందన్నాడు.
Also Read: నేనైతే అశ్విన్‌కు చోటివ్వను..! కేవలం పరుగుల్ని నియంత్రిస్తే సరిపోదన్న మంజ్రేకర్
చెన్నై అదుర్స్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి అదిరిపోయే ఆరంభం ఇచ్చారు ఓపెనర్లు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (32: 27 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), ఫాఫ్ డుఫ్లెసిస్ (86: 59 బంతుల్లో, ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు) మొదటి బంతి నుంచి వేగంగా ఆడారు. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి చెన్నై వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. మొదటి వికెట్‌కు 61 పరుగులు జోడించిన అనంతరం ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రాబిన్ ఊతప్ప (31: 15 బంతుల్లో, మూడు సిక్సర్లు) మొదటి బంతి నుంచి చెలరేగిపోయాడు. దీంతో స్కోరు వేగం ఏమాత్రం తగ్గలేదు. పది ఓవర్లు ముగిసేసరికి చెన్నై వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. ఊతప్ప తర్వాత క్రీజ్ లోకి వచ్చిన మొయిన్ అలీ (37 నాటౌట్: 20 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) కూడా వేగంగా ఆడాడు. మొయిన్ అలీ, డుఫ్లెసిస్ కలిసి మూడో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి డుఫ్లెసిస్ అవుటయ్యాడు. దీంతో చెన్నై 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో నరైన్ రెండు వికెట్లు, శివం మావి ఒక వికెట్ తీశాడు.
Also Read: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే పండగ.. థియేటర్లలో టీ20 ప్రపంచకప్ లైవ్.. ఆ కిక్కే వేరప్పా!
కుప్పకూలిన కోల్‌కతా
కోల్‌కతాకు చెన్నైకి మించిన ఆరంభం లభించింది. ఫాంలో ఉన్న ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (51: 43 బంతుల్లో, ఆరు ఫోర్లు), వెంకటేష్ అయ్యర్ (50: 32 బంతుల్లో, ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు) అద్భుత ఆరంభం ఇచ్చారు. వెంకటేష్ అయ్యర్ ఒక్క పరుగు కూడా చేయకముందే తన క్యాచ్‌ను ధోని వదిలేయడంతో ఆ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాడు. సిక్సర్లు, ఫోర్లు కొడుతూ స్కోరును పరుగులు పెట్టించారు. ఇన్నింగ్స్ పదో ఓవర్లో వెంకటేష్ అయ్యర్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో పది ఓవర్లకు కోల్‌కతా వికెట్ కోల్పోకుండా 88 పరుగులు చేసింది. ఆ తర్వాత మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. చెన్నై బౌలర్లు ఒక్కసారిగా విజృంభించారు. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో శార్దూల్ ఠాకూర్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (0: 1 బంతి)లను అవుట్ చేసి కోల్‌కతాను ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ 12వ ఓవర్లో సునీల్ నరైన్ (2: 2 బంతుల్లో), 14వ ఓవర్లో శుభ్‌మన్ గిల్ అవుటయ్యారు.
జడేజా వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో వరుస బంతుల్లో దినేష్ కార్తీక్ (9: 7 బంతుల్లో, ఒక సిక్సర్), షకీబ్ అల్ హసన్ (0: 1 బంతి) అవుటయ్యారు. ఆ తర్వాత కూడా వికెట్ల పతనం ఆగలేదు. 16వ ఓవర్లో రాహుల్ త్రిపాఠి (2: 3 బంతుల్లో), 17వ ఓవర్లో ఇయాన్ మోర్గాన్ (4: 8 బంతుల్లో) కూడా అవుటయ్యారు. ఆ తర్వాత శివం మావి (20: 13 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు), ఫెర్గూసన్ (18 నాటౌట్: 11 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) మెరుపులు మెరిపించినా అప్పటికే చాలా ఆలస్యం అయింది. దీంతో 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టానికి 165 పరుగులు మాత్రమే చేసింది కోల్ కతా. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా, జోష్ హజిల్‌వుడ్, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీశారు. చాహర్, బ్రేవోలకు చెరో వికెట్ దక్కింది.
Also Read: ఛాంపియన్ సూపర్ కింగ్స్.. నాలుగోసారి ట్రోఫీని ముద్దాడిన చెన్నై.. ఒత్తిడికి చిత్తయిన కోల్‌కతా
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి