సినిమా, క్రికెట్.. ఈ రెండింటికి మన దేశంలో ఉన్న క్రేజే వేరప్పా! కరోనా సంక్షోభం తర్వాత ఇప్పుడిప్పుడే థియేటర్లు నెమ్మదిగా తెరుచుకున్నాయి. ఇక టీ20 ప్రపంచకప్ కూడా రానుంది. మరి ఈ రెండింటిని కలిపేస్తే ఎలా ఉంటుంది? అవును.. మన చిన్నచిన్న టీవీల దగ్గర నుంచి ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ టీవీలలో క్రికెట్ చూసినా ఆ మజా మాములుగా ఉండదు. మరి అలాంటిది.. బిగ్ స్క్రీన్ మీద చూస్తే!.. బొమ్మ అదుర్స్ కదూ! అయితే రెడీ అయిపోండి మరి..
హాల్లో సిక్సర్లు..
ఐసీసీ పురుషుల టీ20 క్రికెట్ ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా మ్యాచ్‌లు థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఈ మ్యాచ్‌లను తమ థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు మల్టీప్లెక్స్ చైన్ ఇనాక్స్ లీజర్ లిమిటెడ్ తెలిపింది. యూఏఈ, ఒమన్‌లలో బీసీసీఐ ఆతిథ్యమివ్వనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ అక్టోబర్ 17న ప్రారంభం కాబోతోంది.
మల్టిప్లెక్స్‌లలో..
భారత్ ఆడనున్న అన్ని లీగ్ మ్యాచ్ లు, సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లను మల్టీప్లెక్స్‌ల్లో ప్రదర్శించనున్నట్లు ఇనాక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని ప్రధాన నగరాల్లోని ఇనాక్స్ మల్టీప్లెక్స్‌ల్లో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా ప్రదర్శించనుంది.
టికెట్ రేటు..
ఈ మ్యాచ్‌లకు టికెట్ ధర ఆయా ప్రాంతాల బట్టి ఉండే అవకాశం ఉంది. రూ.200- రూ.500 వరకు ఉండొచ్చు. అయితే కరోనా నుంచి భద్రతే లక్ష్యంగా వ్యాక్సిన్ తీసుకున్నవారికి మాత్రమే టికెట్ విక్రయించనున్నట్లు సంస్థ తెలిపింది.
పీవీఆర్ కూడా..
ఈ టీ20 ప్రపంచకప్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)తో ఒక ఒప్పందాన్ని చేసుకున్నట్లు పీవీఆర్ సినిమాస్ కూడా ప్రకటించింది. పీవీఆర్ సినిమాస్ మల్టీప్లెక్స్‌ల్లో సెమీ ఫైనల్స్, ఫైనల్‌తో పాటు టీమ్ ఇండియా ఆడనున్న అన్ని లీగ్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా ప్రదర్శించనుంది.
ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు భారత జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవి చంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, జస్ ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ
స్టాండ్ బై ప్లేయర్లు: శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్, అక్షర్ పటేల్
Also Read: నేనైతే అశ్విన్‌కు చోటివ్వను..! కేవలం పరుగుల్ని నియంత్రిస్తే సరిపోదన్న మంజ్రేకర్
Also Read: రోహిత్‌శర్మకు ఇష్టమైన సినిమా, మైదానం, వంటకం ఏంటో తెలుసా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి