Virat Kohli Records: గెలవడం కష్టమే అని అంతా నిరుత్సాహ పడుతున్న టైమ్‌లో మంచి కిక్ ఇచ్చే ఇన్నింగ్స్‌తో అదర గొట్టాడు విరాట్ కోహ్లీ. దాదాపు 17 ఏళ్ల తరవాత భారత్‌కి T20 వరల్డ్ కప్‌ని అందించాడు. అందుకే ఇప్పుడు దేశమంతా కోహ్లీ పేరునే తలుచుకుంటోంది. అలా కప్ గెలుచుకున్నారో లేదో వెంటనే T20 ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పాడు కోహ్లీ. జట్టుకి కప్‌ని అందించడంతో పాటు మరో అరుదైన రికార్డునీ సాధించాడు విరాట్. అండర్ 19 వరల్డ్ కప్ నుంచి మొదలు పెడితే ODI వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వరకూ అన్నింటినీ గెలుచుకున్న ఒకే ఒక ఇండియన్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఈ అన్ని ఫార్మాట్‌లలోనూ జట్టులో ఉండడం వల్ల ఈ అరుదైన రికార్డు సాధ్యమైంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు కోహ్లీ. ఇప్పటి వరకూ 125 T20 మ్యాచ్‌లు ఆడిన విరాట్ 16వ సారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అంతకు ముందు సూర్య కుమార్ యాదవ్‌కి 15 సార్లు ఈ టైటిల్ రాగా..కోహ్లీ ఈ రికార్డుని అధిగమించాడు. మొత్తం కెరీర్‌లో రెండోసారి T20 World Cup ఫైనల్ మ్యాచ్‌లో ఆడాడు. ఈ విషయంలో మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్ సరసన నిలిచాడు. T20 వరల్డ్ కప్‌లోని నాకౌట్ మ్యాచ్‌లలో ఐదోసారి 50 పరుగుల కన్నా ఎక్కువగా స్కోర్ చేశాడు. ఈ విషయంలోనూ రికార్డు సాధించాడు కోహ్లీ.
2011లో విరాట్ కోహ్లీ ODI World Cup సాధించాడు. ఆ తరవాత 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చింది. ఈ రెండింటి కన్నా ముందు 2008లో అండర్ 19 వరల్డ్ కప్‌నీ సొంతం చేసుకున్నాడు. అయితే...T20 టీమ్‌లో కోహ్లీ పొజిషన్ ఏంటన్న అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలో సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అదరగొట్టాడు. 59 బాల్స్‌లో 76 రన్స్ చేశాడు. 176 టార్గెట్‌ని సులువుగా ఛేదించాడు. మొత్తంగా ICC కి సంబంధించి నాలుగు ట్రోఫీలనూ అందుకున్న క్రికెటర్‌గా చరిత్రలో నిలిచిపోయాడు. అటు మహేంద్ర సింగ్ ధోనీ ODI వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీని సాధించుకున్నా అండర్ 19 వరల్డ్ కప్ మాత్రం తన ఖాతాలో లేదు. అలా ధోనీకి కూడా సాధ్యం కాని రికార్డుని సొంతం చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఫైనల్ మ్యాచ్ విన్ అయ్యాక విరాట్ కోహ్లీ అనుష్క శర్మతో వీడియో కాల్ మాట్లాడాడు. స్టేడియంలోనే వీడియో కాల్‌లో తన కూతురికి ముద్దులు పెడుతూ మురిసిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కోహ్లీ ఆ టైమ్‌లో కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. ఆ తరవాత T20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.
Also Read: Nigeria Blasts: నైజీరియాలో వరుస ఆత్మాహుతి దాడులు, 18 మంది మృతి - పలువురికి తీవ్ర గాయాలు