HDFC Bank Credit Card New Rules: దేశంలోని అతి పెద్ద లెండర్‌ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన కోట్లాది మంది క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు అప్రమత్తం కావలసిన సమయం వచ్చింది. ఈ బ్యాంక్, తన క్రెడిట్ కార్డ్ నియమాలను మార్చబోతోంది. నయా రూల్స్ ఆగస్టు 01, 2024 నుంచి అమలులోకి వస్తాయి. మీరు కూడా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగిస్తుంటే, కొత్త ఛార్జీల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.


హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డ్‌ నిబంధనల్లో వచ్చే మార్పులు:           


--- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు క్రెడ్‌ (Cred), చెక్‌ ‍(Cheq), మొబిక్విక్‌ (MobiKwik), ఫ్రీఛార్జ్‌ (Freecharge) వంటి థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా బిల్లు చెల్లిస్తే, లావాదేవీ రుసుముగా 1 శాతం చెల్లించాలి. ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ. 3,000 వరకు ఈ ఛార్జ్‌ ఉంటుంది.


--- అద్దె చెల్లింపులతో పాటు ఇంధన లావాదేవీలపై ఛార్జీలను కూడా బ్యాంక్ మార్చింది. ఇప్పుడు, హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్‌ వినియోగదార్లు రూ. 15,000 లోపు ఇంధన లావాదేవీలపై ఎలాంటి అదనపు ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ లిమిట్‌ రూ. 15,000 దాటితే, ఒక్కో లావాదేవీపై 1 శాతం రుసుము చెల్లించాలి. దీని గరిష్ట పరిమితి రూ. 3,000 వరకు ఉండవచ్చు.


--- యుటిలిటీ ట్రాన్‌జాక్షన్‌ ఛార్జీలు కూడా మారాయి. రూ. 50,000 వరకు యుటిలిటీ బిల్లులపై వినియోగదార్లు ఎలాంటి సర్వీస్‌ ఛార్జ్‌ చెల్లించాల్సిన అవసరం లేదు. రూ. 50,000 దాటిన లావాదేవీలపై, ప్రతి లావాదేవీకి 1 శాతం రుసుము చెల్లించాలి. దీని గరిష్ట పరిమితి రూ. 3000 వరకు ఉంటుంది.


---  కస్టమర్లు అంతర్జాతీయ కరెన్సీ లావాదేవీలపై 3.5 శాతం మార్కప్ ఛార్జ్ చెల్లించాలి.


--- పాఠశాల & కళాశాల ఫీజులను హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్‌తో నేరుగా చెల్లిస్తే సర్వీస్‌ ఛార్జ్‌ పడదు. నేరుగా కాకుండా క్రెడ్‌, చెక్‌, మొబిక్విక్‌, ఫ్రీఛార్జ్‌ వంటి థర్డ్ పార్టీ యాప్‌లను ఉపయోగిస్తే, కస్టమర్‌లు ఒక్కో లావాదేవీకి 1 శాతం లేదా గరిష్టంగా రూ. 3,000 రుసుము చెల్లించాలి. ఇంటర్నేషనల్‌ స్కూళ్లు, కాలేజీలకు చేసే చెల్లింపులను బ్యాంక్‌ ఇందులో చేర్చలేదు.


--- క్రెడిట్ కార్డ్ బిల్లును సకాలంలో చెల్లించలేకపోతే, రూ. 100 నుంచి రూ. 1300 వరకు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఈ పెనాల్టీ మొత్తం కార్డ్‌ ఔట్‌స్టాండింగ్‌ అమౌంట్‌పై ఆధారపడి ఉంటుంది.


--- క్రెడిట్ కార్డ్‌ EMI ప్రాసెసింగ్ ఫీజులను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మార్చింది. కస్టమర్‌ ఏదైనా వెబ్‌సైట్‌లో షాపింగ్ చేసిన తర్వాత, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ ద్వారా EMIని ప్రాసెస్ చేస్తే, ప్రాసెసింగ్ ఛార్జీగా రూ. 299 చెల్లించాలి. దీనికి అదనంగా GST కూడా చెల్లించాలి.


ఆగస్టు 01 నుంచి కొత్త నిబంధనలు అమలు                   


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం, క్రెడిట్ కార్డ్ నిబంధనల్లో తీసుకువచ్చిన అన్ని మార్పులు ఈ ఏడాది ఆగస్టు 01వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.


మరో ఆసక్తికర కథనం: మన దేశంలో అత్యధిక లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలు ఇవి - టాప్‌ ప్లేస్‌లో రిలయన్స్