T20 World Cup 2022:


టీ20 ప్రపంచకప్ కు ఇంకా 40 రోజుల సమయం కూడా లేదు. కాబట్టి బీసీసీఐ సెలక్షన్ కమిటీ సభ్యులు తుది జట్టును ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆటగాళ్లను పరీక్షించేందుకు, వారి ఫామ్ ఎలా ఉందో చూసేందుకు ఆసియా కప్ ను ఉపయోగించుకున్నారు. సెప్టెంబర్ 16న బీసీసీఐ టీ20 ప్రపంచకప్ ఆడే భారత జట్టును ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. 


ఈలోగా భారత మాజీ ఆటగాళ్లు, అభిమానులు వారి వారి జట్లను ప్రకటిస్తున్నారు. వారికి నచ్చిన, వారు మెచ్చిన క్రికెటర్లతో 15 మంది జాబితా తయారుచేస్తున్నారు. అలాగే భారత మాజీ పేస్ బౌలర్ ఆశిష్ నెహ్రా 15 మందితో కూడిన తన జట్టును ప్రకటించాడు. 


గాయం నుంచి కోలుకుని వచ్చిన తర్వాత అంతగా రాణించలేకపోతున్న కేఎల్ రాహుల్ పై నెహ్రా నమ్మకముంచాడు. టీ20 ప్రపంచకప్ లోపు అతను ఫాంలోకి వస్తాడని విశ్వసించాడు. కాబట్టి తనను టాప్ ఆర్డర్ లో చేర్చాడు. అలాగే ఆసియా కప్ లో అంతగా ఆకట్టుకోలేకపోయిన సూర్యకుమార్, పంత్ లకు తన జట్టులో చోటిచ్చాడు. 4, 5 స్థానాల్లో వారు కీలకం అవుతారని అభిప్రాయపడ్డాడు. అలాగే సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను తన జట్టులోకి తీసుకున్నాడు. చహాల్, జడేజా ఉన్నప్పటికీ.. అశ్విన్ కు ఆడే అవకాశం వస్తే తప్పకుండా ప్రభావం చూపుతాడని అన్నాడు. 


ఈ ఏడాది భారత్ తరఫున ఎలాంటి టీ20 క్రికెట్ ఆడని మహ్మద్ షమీని 15 మందితో కూడిన జట్టులో చేర్చలేదు. అద్భుత ఫామ్ లో ఉన్న దీపక్ చాహర్ ను జట్టులోకి తీసుకోకూడదని నెహ్రా నిర్ణయించుకున్నాడు.


టీ20 ప్రపంచకప్ కు ఆశిష్ నెహ్రా జట్టు


రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యజువేంద్ర చహాల్, రవిచంద్రన్ అశ్విన్, దినేశ్ కార్తీక్, జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, అర్హదీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, దీపక్ హుడా.


 


ఇక ఆసియా కప్ విషయానికొస్తే లీగ్ దశలో ఓటమి లేకుండా 2 విజయాలు సాధించిన భారత్.. సూపర్- 4లో రెండు వరుస ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. టాపార్డర్ లో విరాట్ కోహ్లీ నిలకడగా రాణించాడు. రోహిత్, రాహుల్ లు ఒక్కో మ్యాచ్ మినహా అంతగా ఆకట్టుకోలేదు. మంచి ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ హాంకాంగ్ తో మ్యాచ్ లో తప్ప మిగతా వాటిలో పరుగులు చేయలేదు. పాండ్య ఆల్ రౌండ్ మెరుపులు పాక్ తో లీగ్ మ్యాచ్ కే పరిమితమయ్యాయి. పంత్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 


ఇక బౌలింగ్ లోనూ ఇబ్బందులున్నాయి. బుమ్రా గైర్హాజరీలో పేస్ విభాగం బలహీనపడింది. భువనేశ్వర్ కుమార్ పవర్ ప్లేలో అద్భుతంగా బంతులు వేస్తున్నా.. డెత్ ఓవర్లలో తేలిపోతున్నాడు. కొత్త కుర్రాళ్లలో అర్హదీప్ ఆకట్టుకున్నప్పటికీ.. అవేష్ ఖాన్ ధారాళంగా పరుగులు ఇచ్చాడు. స్పిన్నర్లలో చహాల్ పరుగులు కట్టడి చేసినప్పటికీ.. వికెట్లు తీయలేకపోయాడు. యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఆడిన ఒక్క మ్యాచులో ఆకట్టుకున్నాడు. జడేజా మోకాలి గాయంతో మొత్తం టోర్నీకే దూరమయ్యాడు. శస్త్రచికిత్స చేయించుకున్న ఈ ఆల్ రౌండర్ టీ20 ప్రపంచకప్ లో ఆడేది అనుమానమే.


గత కొంతకాలంగా చాలామంది ఆటగాళ్లకు అవకాశమిచ్చి పరిశీలిస్తున్న బీసీసీఐ సెలక్టర్లు.. మెగా టోర్నీకి ఎలాంటి జట్టును ఎంపిక చేస్తారో చూడాలి.