Karimnagar Politics : టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ ఎమ్మెల్యేనో లేదా మంత్రి కావాలని అత్యాశతో కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ మంత్రి గంగుల కమలాకర్ పై కుట్రలు పన్నుతున్నారని కరీనంగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్ ఆరోపించారు. ప్రజలను పక్కదోవ పట్టిస్తున్న మాజీ మేయర్ రవీందర్ సింగ్ ను టీఆర్ఎస్ నుంచి బహిష్కరించాలని  చల్ల స్వరూపరాణి డిమాండ్ చేశారు. రవీందర్ సింగ్ అల్లుడు  కార్పొరేటర్ కమల్ జీత్ కౌర్ భర్త సోహన్ సింగ్ అనే వ్యాపారితో మంత్రిపై కుట్రలు పన్నినట్లు ఒక ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా స్థానిక హోటల్ లో శనివారం కార్పొరేటర్లతో కలిసి డిప్యూటీ మేయర్ అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.  



రవీందర్ సింగ్ ను పార్టీ నుంచి బహిష్కరించాలి  


మంత్రి గంగుల కమలాకర్ ను పరుష పదజాలంతో దూషించడమే కాకుండా మంత్రిని తాము చిత్ర హింసలు పెడుతున్నామని, గణేష్ నిమజ్జనం మరుసటి రోజు కలెక్టరేట్ ఎదుట వంట వార్పు ఏర్పాటు చేసి మంత్రిని అప్రతిష్ట పాలు చేయాలని రవీందర్ సింగ్ తాను నిర్ణయించుకున్నట్లు ఒక వ్యాపారితో మాట్లాడే ఆడియోను చల్ల స్వరూపరాణి విలేకరులకు వినిపించారు. మంత్రి పట్ల అమర్యాద మాట్లాడమే కాకుండా తమ డివిజన్ పరిధిలోని సిక్ వాడి, బోయవాడ, టవర్ సర్కిల్ ప్రాంతాల్లో రవీందర్ సింగ్ రాత్రికి రాత్రి తమ జేసీబీతో రోడ్లు, మురుగు కాల్వలు, పైపు లైన్లను అన్నింటిని తవ్వి తామే సమస్యలు సృష్టిస్తున్నామని ఆడియోలో చెప్పడం చూస్తుంటే కుట్రలకు తెరలేపారో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. గతంలో కూడా రవీందర్ సింగ్ తో పాటు కార్పొరేటర్ కమల్ జీత్ కౌర్ తమ డివిజన్లలో పనులు పూర్తి చేయడం లేదని, తాగునీరు రావడం లేదని కౌన్సిల్ లో ఖాళీ బిందెలతో ప్రదర్శిస్తూ తప్పుడు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. మాజీ మేయర్ రవీందర్ సింగ్ అతని కుటుంబ సభ్యులు పథకం ప్రకారం వాళ్ల డివిజన్ లలో నీళ్లు రాకుండా చేసుకొని మంత్రి గంగుల కమలాకర్ కారణమంటూ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు గమనించాలని కోరారు. స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్ ను పది లక్షలు మామూళ్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని  అన్నారు. సొంత పార్టీలో ఉంటూ కుట్రలు చేస్తున్న రవీందర్ సింగ్ అతని కుటుంబ సభ్యులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కార్పొరేటర్లు మంత్రి గంగులను, పార్టీ వర్కింగ్ ప్రెసిడంట్ కేటీఆర్, సీఎం కేసీఆర్ కు విన్నవించారు. 


ఆడియో వైరల్ 


కరీంనగర్ జిల్లాలో ఓ  ఆడియో క్లిప్ వైరల్ అవుతుంది. మంత్రి గంగుల కమలాకర్, మాజీ మేయర్ రవీందర్ సింగ్ మధ్య వర్గ పోరు మళ్లీ తెరపైకి వచ్చింది. మంత్రి గంగులను ఇబ్బంది పెట్టాలంటూ రవీందర్ సింగ్ దగ్గర బంధువు మాట్లాడిన ఆడియో కాల్ ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.  మొన్నటి వరకు కాస్త రాజీకి వచ్చినట్టుగా కనబడ్డా... ఇరువర్గాల మధ్య విభేదాలు అలాగే ఉన్నాయని ఈ ఆడియోతో తెలుస్తోంది. గంగుల తమ ప్రాంతంలో అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ దీనికి పోటీగా తామే జేసీబీతో అక్కడి డ్రైనేజీలను ధ్వంసం చేసి నిరసనకు దిగుతామంటూ ఆడియోలో మాట్లాడారు కార్పొరేటర్ కమల్జిత్ కౌర్ భర్త సోహన్ సింగ్. 


Also Read : Revanth Reddy : దిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ఇల్లు ఎందుకు సోదా చేయలేదు- రేవంత్ రెడ్డి


Also Read : Munugode TRS Candidate : మునుగోడుపై తేల్చుకోలేకపోతున్న కేసీఆర్ - అభ్యర్థిత్వం ఎవరికో ?