Rahul Row : కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో క్రిస్టియన్ మత గురువులతో రాహుల్ గాంధీ నిర్వహించిన ఓ చర్చ వివాదాస్పదమైంది. ప్రస్తుతం ఆ యాత్ర తమిళనాడులో కొనసాగుతోంది. ఈ పర్యటన భాగంగా పొలియార్‌కురుచ్చిలోని ముట్టిదిచాన్ పారై చర్చిలో కొందరు క్యాథలిక్ మతగురువులతో సమావేశమయ్యారు. వీరిలో వివాదాస్పద పాస్టర్ జార్జ్ పొన్నయ్య కూడా ఉన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. అందులో ఆ పాస్టర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దూమారం రేపుతున్నాయి.
ఈ వీడియో క్లిప్ పై బీజేపీ స్పందిస్తూ.. ఇది బారత్ జోడో యాత్ర కాదనీ, 'భారత్ తోడో యాత్ర' అని అభివర్ణించింది. బీజేపీ నేతలు ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.
రాహుల్ గాంధీ మాట్లాడిన పాస్టర్ పొన్నయ్యకు గతంలోనూ ఇలాంటి వివాదాస్పద, రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన చరిత్ర ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, డీఎంకే ప్రభుత్వంలోని మంత్రులు తదితరులపై అనుచిత పదజాలం ఉపయోగించిన ఆరోపణలపై గత ఏడాది జూలైలో మదురైలోని కలికుడి వద్ద ఆయనను అరెస్టు చేశారు. శక్తి, ఇతర హిందూ దేవతలకు బదులు యేసు మాత్రమే దేవుడని పొన్నయ్య చెప్పారని బీజేపీ నేతలంటున్నారు పాస్టర్ కూడా భారతమాత గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడనీ, హిందూ సంప్రదాయలను వ్యతిరేకించిన సుదీర్ఘ చరిత్ర కాంగ్రెస్ కు ఉందనీ ఏపీ బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి విమర్సించారు. వంద కోట్ల మంది భారతీయులకు సమాధానం చెప్పాలని విష్ణువర్ధన్ రెడ్డి రాహుల్‌ను డిమాండ్ చేశారు.
అయితే బీజేపీ ఆరోపణపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఖండించారు. ఆడియోలో రికార్డయిన దానితో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. భారత్ జోడో యాత్ర విజయవంతమైన తర్వాత బీజేపీ నిరాశకు గురైందనీ, అందకు ఇలాంటి ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు.
ఒక్క రోజు ముందే రాహుల్ ధరించిన టీ షర్ట్ పై వివాదం రేగింది. రెండో రోజే పాస్టర్ అంశం వివాదాస్పదమయింది.