BJP On Rahul Gandhi: 


హిందువులను కించపరిచిన వాళ్లను కలుస్తారా: భాజపా 


ప్రస్తుతం రాహుల్ గాంధీ...భారత్ జోడో యాత్రలో బిజీబిజీగా ఉన్నారు. భాజపాతో విసిగిపోయిన ప్రజల్ని ఒకే తాటిపైకి తీసుకొచ్చే యాత్ర ఇది అని రాహుల్ చెబుతుండగా...అటు భాజపా ఆయనపై ఏదో విధంగా విమర్శలు చేస్తూనే ఉంది. రాహుల్ వేసుకున్న టి షర్ట్ గురించి పెద్ద వాదనే నడుస్తోంది. ఇది ముగిసిపోకముందే మరో వాదన తెరపైకి వచ్చింది. తమిళనాడులో అత్యంత వివాదాస్పద కాథలిక్ ప్రీస్ట్ జార్జ్ పొన్నయ్య (George Ponnaiah)ను రాహుల్ కలవడంపై భాజపా ఫైర్ అవుతోంది. ఈ మీటింగ్‌కు సంబంధించిన వీడియోలో పొన్నయ్య "జీసస్ క్రైస్ట్ నిజమైన దేవుడు" అని అన్నారు. "దేవుడు ఎప్పుడూ తనను తాను మనిషిగానే చెప్పుకుంటాడు. ఏదో అతీంద్ర శక్తిగా కాదు" అని పొన్నయ్య చేసిన వ్యాఖ్యల్ని హైలైట్ చేస్తూ...భాజపా నేత షెహజాద్ పూనావాలా ఈ వీడియో క్లిప్‌ను షేర్ చేశారు. జీసస్ క్రైస్ట్ దేవుడి రూపంలో ఉన్న మనిషా..? లేదంటే దేవుడేనా..? అని రాహుల్ అడిగిన ప్రశ్నకు పొన్నయ్య అలా సమాధానమిచ్చారు. దీనిపై షెహజాద్ పూనావాలా రాహుల్‌పై మండి పడ్డారు. "గతంలో హిందువులపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన ప్రీస్ట్‌ను రాహుల్ కలిశాడంటూ మండి పడ్డారు. "భారత్‌ జోడో విత్ భారత్ తోడో ఐకాన్స్" అంటూ ట్వీట్ చేశారు. " భారత మాత గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని రాహుల్ కలవటమేంటో..? 
కాంగ్రెస్‌కు యాంటీ హిందూ హిస్టరీ ఉంది" అని విమర్శించారు. 




కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ 


దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పందించారు. "ఇది భాజపా చేస్తున్న కుట్ర. అక్కడ రికార్డ్ చేసిన ఆడియోకి, అక్కడ జరిగిన సంభాషణకు ఎలాంటి సంబంధమూ లేదు. భారత్‌ జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్న అక్కసుతో భాజపా ఇలా చేస్తోంది" అంటూ ట్వీట్ చేశారు. "మహాత్మా గాంధీ, నరేంద్ర దభోల్కర్, గోవింద్ పన్సారే, ఎమ్ఎమ్ కల్‌బుర్గి, గౌరీ లంకేష్‌ హత్యలకు కారణమైన వాళ్లు రాహుల్‌ను ప్రశ్నిస్తున్నారా..? ఇంత కన్నా పెద్ద జోక్ ఏముంటుంది..? భారత్ జోడో యాత్ర స్ఫూర్తిని దెబ్బ తీసేందుకు ఇదంతా" అని మండిపడ్డారు.